కేంద్రమంత్రి చిరంజీవిని ముఖ్యమంతిగా చూడాలన్న ఆయన విధేయ బృందంపై కాపు వర్గానికి చెందిన మరో మెజారిటీ వర్గం మండి పడుతోంది. ఈ నేపథ్యంలో అసలు చిరంజీవి ఇప్పటివరకూ కాపు వర్గానికి చేసిన మేలు, చేసిన పోరాటాలేమిటన్న ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు.
కాపు ఉద్యమాలు జరుగుతున్న సమయంలో చిరంజీవి ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న మొదలయింది. అన్నేళ్ల సినిమా జీవితంలో ఏనాడూ కాపుల సమస్య గురించి కనీసం పెదవి విప్పిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. పైగా కాపులను దూరం పెట్టిన చరిత్ర కూడాఉందంటున్నారు. కాపులు గత 30 సంవత్సరాల నుంచి తమ హక్కుల సాధనకు పోరాడుతుంటే ఒక్కసారయినా వచ్చి కనీస సంఘీభావం ప్రకటించేదని కాపునాడు నే తలు కొందరు గుర్తు చేస్తున్నారు. వంగవీటి రంగా హత్యకు గురయితే కనీసం వచ్చి చూసేందుకూ ప్రయత్నించని చిరంజీవిని, ఇప్పుడు కాపు-బలిజలు ఏవిధంగా తమవాడిగా భావించి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరగలరని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ఆయనే తాను కొందరివాడిని కాదని, అందరివాడినని ప్రకటించుకుంటే చిరంజీవిని కాపు నేతగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు.
రంగాను నాటి తెలుగుదేశం ప్రభుత్వం నానా కష్టాలు పెడితే అప్పుడు కాపులు ఎవరి సాయం లేకుండా ఇప్పటి సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కార్పొరేషన్ చైర్మన్ కంచి రామారావు వంటి అతి తక్కువ నాయకులు మాత్రమే ఎదురొడ్డి పోరాడారని, ఆ సమయంలో చిరంజీవి సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ, కనీస సంఘీభావం ప్రకటించని వ్యక్తి ఇప్పుడు కాపు కార్డు ఏవిధంగా పెట్టుకుంటారన్న ప్రశ్న సంధిస్తున్నారు. ప్రధానంగా... సినిమాల్లో మెగాస్టార్‌గా వెలిగిన సమయంలో చిరంజీవి కాపు నిర్మాతలకు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. బావమరిది అల్లు అరవింద్‌కు తప్ప, మరే కాపు నిర్మాతకు అవకాశాలు ఇవ్వలేదని, ఎక్కువగా కమ్మ సామాజికవర్గానికి, ఆ తర్వాత రెడ్డి నిర్మాత-దర్శకులకు అవకాశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పీఆర్పీ స్థాపించిన తర్వాత కూడా టీడీపీ నుంచి వెళ్లిన కమ్మ నాయకులనే చుట్టూ చేర్చుకున్నారు తప్ప, కాపులను ప్రోత్సహించలేదం టున్నారు.
ఎంతోమంది పేద కాపు విద్యార్ధులు డబ్బు లేక పై చదువులు చదవలేక గుమాస్తాలుగా పనిచేస్తుంటే, కాపు కార్డును అడ్డుపెట్టుకుని పైకి ఎదిగిన చిరంజీవి ఒక్కరికీ ఆర్ధిక సాయం చేయలేదని చెబుతున్నారు. చిరంజీవి హీరోగా పైకి ఎదుగుతున్న సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ, శోభన్‌బాబు అభిమానసంఘాల మధ్య కోస్తాలో ఘర్షణలు జరిగిన సమయంలో.. కాపు వర్గానికి చెందిన యువకులంతా చిరంజీవి పక్షాన నిలబడి వారితో పోరాడేవారు. ఆ సందర్భంలో వేలాదిమంది కాపు వర్గానికి చెందిన చిరు అభిమానులు ఆసుపత్రి పాలయి, కేసులు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కరికీ సాయం చేయలేదని, అప్పుడు స్థానికంగా ఉన్న కాపు నేతలే వారిని ఆదుకున్న విషయాన్ని కాపు వర్గ నేతలు గుర్తు చేస్తున్నారు.
కాపుల పక్షాన తెలుగుదేశంపై తిరుగులేని పోరాటం చేసిన దివంగత నేత వంగవీటి మోహన రంగాను కూడా చిరంజీవి అవమానించిన సందర్భాలున్నాయని కాపు నేతలు చెబుతున్నారు.
విజయవాడలో చిరంజీవి నటించిన విజేత సినిమా ఫంక్షన్‌కు అదే నగ రంలో అందుబాటులో ఉన్న వంగవీటి రంగాను ఆహ్వానించలేదని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. దానితో ఆగ్రహానికి గురయిన కాపు యువకులు రసాభాస సృష్టించారని చెబుతున్నారు. ఇక చిరంజీవి రంగాను ఒక సందర్భంలో అవమానించిన వైనం కూడా ఉందని సినీ రంగానికి చెందిన ఓ ప్రముఖుడు చెబుతున్నారు. నాటి మద్రాసులో చిరంజీవిని కలిసి, కాపు ఉద్యమంపై చర్చించేందుకు వెళ్లిన రంగాకు పదిరోజుల వరకూ ఆపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆ సినీ ప్రముఖుడు గుర్తు చేశారు.పీఆర్పీ స్థాపించిన తర్వాత తాను కాపు నాయకుడినని చెప్పుకునేందుకు సిగ్గు పడిన చిరంజీవిని ఇప్పుడు కాపులు ముఖ్యమంత్రి కావాలని ఏవిధంగా కోరుకుంటారని కాపు వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తాను అందరివాడినని, దయచేసి కొందరివాడిని చేయవద్దని చిరంజీవి లెక్కలేనన్ని సార్లు ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కులం గురించి చెప్పుకునేందుకు మొహమాటపడే నాయకుడిని కులనేతగా గుర్తించడమే ఒక పొరపాటయితే, ఆయనను ఏకంగా సీఎంను చేయాలని రామచంద్రయ్య వంటి నేతలు కోరడం మరొక తప్పని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి హాజరయిన సభల్లో పాల్గొన్న వారిలో 80 మంది వివిధ ఘటనల్లో మృతి చెందితే వారిలో 50 మందికి పైగా కాపులేనని, అయినా వారి కుటుంబాలకు ఇప్పటివరకూ నయా పైసా సాయం చేయలేని నాయకుడు ముఖ్యమంత్రి అయినా కులానికి ఏమి ఒరగబెడతారని ప్రశ్నిస్తున్నారు.
సి.రామచంద్రయ్య వంటి ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చినందువల్ల ఆయనకు చిరంజీవి అంటే అభిమానం ఉంటుందని, చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ఉంటుం దని, కానీ ఆయన వల్ల ఏ విధంగానూ, ఏ రూపంలోనూ లబ్థిపొందని యావత్ కాపు సామాజికవర్గానికి చిరంజీవి సీఎం కావాలని ఎందుకు ఉంటుందని కాపు నేతలే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ చూపించి, ఆ కార్డుతో చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసి, యావత్ కాపు సమాజం చిరంజీవి వెనక ఉందనే కుల రాజకీయా లు మానుకోవాలని కాపు నేతలు హితవు పలుకుతున్నారు. పీఆర్పీ తర్వాత కాపులు రాజకీయంగా నష్టపోతే, కులం పేరు అడ్డుపెట్టుకున్న చిరంజీవి మాత్రం అన్ని రకాలుగా లాభపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు నాయకులు గతంలో రాహుల్‌కూ స్పష్టం చేశా రు.
చిరంజీవి కాపు వర్గాన్ని నట్టేట ముంచి, తన దారి తాను చూసుకున్నారని రాహుల్‌కు వివరించిన విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయ కత్వాలు కనీసం తమ కులాన్ని, బలాన్ని చూసయినా భయపడి పదవులిచ్చి, ఆదరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఆ రెండు పార్టీలు కాపులను దూరంగా పెట్టాయని, కాపులకు ఎంతచేసినా వారు చిరంజీవి వైపే వెళతారన్న అనుమానం కలిగించారని, దానితో కాపులు రాజకీయంగా అనాధ లయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి సుబ్బా రాయుడు, బూర్లగడ్డ వేదవ్యాస్, వంగా గీత, సత్యానంద రావు, గంటా శ్రీనివాసరావు వంటి నాయకులకు ఆయా పార్టీల్లో సము చిత స్థానమే కల్పించారని గుర్తు చేశారు.
కానీ వేదవ్యాస్ వంటి నేతలు కాపులంతా చిరంజీవిని అందలమెక్కిస్తారని భ్రమ పడి కాంగ్రెస్‌ను వీడి తర్వాత ఓడిపోయారని, లేకపోతే అలాంటి వారంతా ఇప్పుడు మంత్రివర్గంలో ఉండేవారంటున్నారు. తన కోసం పదవిని కూడా త్యాగం చేసిన వేదవ్యాస్ వంటి వారిని పక్కనపెట్టి, నిరంతరం పొగిడే రామచంద్రయ్య వంటి వారిని ప్రోత్స హిస్తున్న చిరంజీవిని కాపులు ఎందుకు సమర్థించాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ, టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారికీ చివరకు అదే గతి పడుతుందని కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
http://www.suryaa.com/state/article-137900

0 comments:
Post a Comment