Home » , , , » గాలి గతే జగన్‌కు: చంద్రబాబు అశల పల్లకీ

గాలి గతే జగన్‌కు: చంద్రబాబు అశల పల్లకీ

కర్ణాటక ఫలితాలతో ఎక్కువగా అనందిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని చెప్పాలి. కర్ణాటకలో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఓ దినపత్రికలో చేసిన విశ్లేషణ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగు నాట కన్నడ తీర్పు తథ్యమంటూ ఆయన విశ్లేషించారు. ఆయన విశ్లేషణ సరైందేనా, రాష్ట్రంలో కర్ణాటక ఫలితాలే వస్తాయా అనేవి ప్రశ్నలు.
కర్ణాటకలో అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారనేది పైకి కనిపించేది మాత్రమే. యడ్యూరప్పను దూరం చేసుకోవడం వల్ల బిజెపి బలహీనపడింది. యడ్యూరప్పను దూరం చేసుకున్న తర్వాత బిజెపిలో నాయకత్వ వివాదం తొలగిపోలేదు. అంటే, పార్టీలో అంతర్గత కలహాలు సమసిపోలేదు. దానికితోడు, గాలి జనార్దన్ రెడ్డి తన డబ్బులతో కాంగ్రెసుకు కంచుకోటగా ఉంటూ వచ్చిన బళ్లారిని ఏలారు. దాంతో బిజెపి గతంలో అధికారంలోకి వచ్చింది. గతంలో బిజెపి అధికారంలోకి రావడానికి కారణమైన ఇద్దరు నేతలు గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప దూరమయ్యారు. ముఖ్యంగా యడ్యూరప్ప వల్ల బిజెపి చాలా వరకు బలహీనపడింది.
గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు పెట్టిన పార్టీని గానీ, యడ్యూరప్ప పార్టీని గానీ ఆదరించకపోవడాన్ని ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారనే కోణంలో విశ్లేషిస్తున్నారు. అది పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెసుకు గానీ బిజెపికి గానీ ప్రత్యామ్నాయాలుగా రూపొందే కార్యాచరణ చేపట్టలేదు. చెప్పాలంటే, ఆ పార్టీలకు ఆ సమయం చిక్కలేదు. జిల్లాలవారీగా, అంటే స్థానికంగా పార్టీని నిలబెట్టే నాయకత్వాలు ఆ పార్టీలకు లేవు.
గాలి జనార్దన్ రెడ్డి మాదిరిగానో, యడ్యూరప్ప లాగానో వైయస్ జగన్ పార్టీ అవినీతి ఆరోపణల కారణంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని, అవినీతిని ప్రోత్సహించిన పార్టీగా కాంగ్రెసును ప్రజలు తిప్పికొడతారని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. కానీ, పరిణామాలు ఆ దిశగా సాగడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్న బిజెపిని కర్నాటక ప్రజలు ఓడించి, ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీకి కర్నాటకలో పట్టం కట్టారు. అదే రాష్ట్రంలో జరుగుతుందనేది తెలుగుదేశం పార్టీ నమ్మకంగా కనిపిస్తోంది.
కానీ, తెలుగుదేశం పార్టీని నాయకులు వీడిపోతున్నారు. జాతీయ పార్టీగా కాంగ్రెసుకు ఉండే వెసులుబాటు ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి, అందునా ఒక నాయకుడి ఆలోచనల మేరకే నడిచే తెలుగుదేశం పార్టీకి పరిమితులు చాలా ఉంటాయి. తెలుగుదేశం నుంచి నాయకులు ఒక్కరొక్కరే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకో, తెలంగాణ రాష్ట్ర సమితిలోకో వెళ్లిపోతున్నారు. తాజా పరిస్థితి చూస్తే, తెలుగదేశం పార్టీ కాంగ్రెసు పార్టీ కన్నా బలహీనంగా ఉందనే విషయాన్ని గుర్తించడానికి ఆ పార్టీ నాయకులు గుర్తించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైయస్ జగన్ ఎక్కువగా కాంగ్రెసు పార్టీ ఓట్లు చీలుస్తారా, కాంగ్రెసు ఓట్లు చీలుస్తారా అనేది కూడా ఫలితాల విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇరు పార్టీల ఓట్లను చీల్చడానికి అవకాశం ఉంది. జగన్ అవినీతిని ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం లేదనేది కూడా గుర్తించాల్సి ఉంటుంది. అట్లని అవినీతిని బలపరుస్తున్నారని కూడా చెప్పడానికి లేదు. ఎవరు మాత్రం అవినీతికి పాల్పడలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికితోడు, వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల వైయస్ జగన్‌కు ఆయన కుమారుడిగా ఆదరణ ఉంది. జిల్లాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, ఇతర పార్టీలను బలహీనపరిచే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు బలహీనపడుతున్నాయి.
ఇకపోతే, తెలంగాణ వంటి సమస్య కర్ణాటకలో లేదు. తెలంగాణలో ఇప్పటికిప్పుడైతే కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలంగా ఉంది. తెలంగాణవాదం కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జరగాల్సిన వలసలు కూడా ఆగిపోయాయి. తెలంగాణవాదం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తరణకు ఆటంకంగా మారింది. అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీపై కూడా తెలంగాణలో వ్యతిరేకత ఉంటుంది.
తెలంగాణకు సంబంధిచినంత వరకు వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం, తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను సమాన స్థాయిలో ఉన్నాయని భావిస్తే, కెసిఆర్‌ను దెబ్బ తీయడం ఈ రెండు పార్టీలకు కూడా అంత సులభం కాదు. నిజానికి, ఏదో మేరకు తెలంగాణలో ఈ రెండు పార్టీల కన్నా కాంగ్రెసు సత్తా చూపే అవకాశాలుంటాయి. ఏమైనా, కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలో వస్తాయని అంచనా వేయడానికి ముందు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే, చంద్రబాబుకు నష్టమే జరుగుతుంది.

http://telugu.oneindia.in/talk-of-the-day/2013/andhrapradesh-chandrababu-happy-with-karntaka-results-116459.html
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger