
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజకీయాలలో తలపండిపోయింది. రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేయడంలో, వెన్నుపోట్లు పొడవడంలో, కుతంత్రాలు పన్నడంలో ఆయన దిట్ట. రాజకీయాలలో అడ్డదారిలో ఎలా ఎదగాలో మన రాష్ట్రంలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తికాదు. కుటుంబ సంబంధాలను ఏ సమయంలో ఎలా వాడుకోవాలో కూడా ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. రాజకీయ నాయకులు ఒకసారి చెప్పిన మాటమీద నిలబడరనేది ఆయన విషయంలో అక్షరాల నిజం. రాజకీయాలలో అధికారం కోసం అనుసరించవలసిన కుట్రలు - కుతంత్రాలు - కుయుక్తులు - వెన్నుపోట్లు .... అన్నీ అనుసరించారు. విజయం సాధించారు. ఆయన తెలివితేటలకు రాజకీయంగా అందుకోవలసిన పదవులు అన్నీ అధిరోహించారు. కానీ అదే ఎల్లకాలం సాగాలంటే సాగదు గదా! పాపం ఆ విషయమే ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ఆయనను చూస్తుంటే జాలేస్తుంది. అన్ని విషయాలు ప్రజలకు తెలిసిపోయిన తరువాత ఇక ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మరు.
మహానటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న బాబు అధిష్టానం ఆదేశిస్తే మామపైనే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత టిడిపిలో చేరిపోయారు. తెలివిగా అవకాశం కలిసివచ్చేవరకు సమయం కోసం వేచిఉండి పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చలాయించారు. ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం ఇస్తే, ఆ బియ్యాన్ని 5 రూపాయలకు పెంచారు. మామ సంపూర్ణ మద్యనిషేధం ప్రకటిస్తే, బాబు ఆ నిషేధం ఎత్తివేశారు. హైటెక్ మోజులోపడి రైతులను విస్మరించారు. ప్రజలను, ప్రజల బాధలను పట్టించుకోలేదు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి, ఆ పెంపును వ్యతిరేకించిన ప్రజలపై కాల్పులు జరిపించారు. అప్పటికే బాబు వ్యవహారాన్ని తెలుసుకున్న ప్రజలు తగిన విధంగా బుద్దిచెప్పారు. ఎల్లకాలం తన ఆటలు సాగవని బాబు తెలుసుకోలేకపోయారు. ఇంకా అధికారం కోసం విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో నందమూరి కుటుంబాన్ని సమయానుకూలంగా తన ఇష్టం వచ్చిన రీతిలో మలచుకుంటున్నారు. నందమూరి కుటుంబం తనతో ఉంటే ప్రజలు తనకు మద్దతు పలుకుతారని ఆయన అపోహ. ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టి పోరాడారో, అదే పార్టీలో ఆయన కుమార్తె పురంధేశ్వరి, పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేరిపోయారు. ఈ పరిస్థితులలో ఆ కుటుంబంతో బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవడం కోసం సినీహీరో బాలకృష్ణతో సంబంధం కలుపుకున్నారు. తన కుమారుడు లోకేష్ కు బాలకృష్ణ కుమార్తెతో పెళ్లి జరిపించారు. ఈ పెళ్లితో బాలకృష్ణను తన చెప్పుచేతలలో ఉంచుకోవచ్చన్నది బాబు భావన. వాస్తవానికి ఆయన అధికారంలో ఉండగా మేనరికాలను వ్యతిరేకించారు. మేనరికాలను ప్రోత్సహించవద్దని ప్రచారం చేశారు. బాలకృష్ణతో సంబంధం కలుపుకుంటే రాజకీయంగా బలపడతానన్న నమ్మకంతో మేనరికం వ్యవహారాన్ని పక్కనపెట్టారు. ఇది చంద్రబాబు రాజకీయ తెలివితేటలకు పరాకాష్ట. ఆ తరువాత హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా తన బంధువుల అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించారు. ఇన్నిచేసినా ఫలితం కనిపించలేదు.
పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఈ పరిస్థితులలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ పాదయాత్ర ఏమంటూ మొదలు పెట్టారో అప్పటి నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాదయాత్ర మొదలు పెట్టిన రోజున వచ్చిన నందమూరి హరికృష్ణ ముగింపు సభకు హాజరుకాలేదు. అంతేకాకుండా ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ, మరో హీరో తారకరత్న తప్ప మరెవ్వరూ హాజరు కాలేదు. ఈ మధ్యలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఫ్లెక్సీల వివాదంతో విభేదాలు తలెత్తాయి. దాంతో నందమూరి కుటుంబ సభ్యులు దూరం అవుతున్నట్లు స్పష్టమైపోయింది. పిల్లనిచ్చాడు గాబట్టి బాలకృష్ణ బాబును అంటిపెట్టుకొని ఉండకతప్పదు. బాబు ఉద్దేశమే అది. అంటిపెట్టుకొని ఉండటమే గాక మిగిలిన కుటుంబ సభ్యులను తనతో సఖ్యతగా ఉండేందుకు బాలకృష్ణను ఎలా ఉపయోగించుకోవాలో కూడా అతనికి బాగా తెలుసు. చంద్రబాబు ఎంత రాజకీయం చేసినా, ఎంత తెలివిగా వ్యవహరించినా నందమూరి కుటుంబం అండలేకపోతే ఆయన రాజకీయ మనుగడ కష్టం. పార్టీ ఉనికికే ప్రమాదం. ఆ విషయాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే నందమూరి కుటుంబ సభ్యులు తనతో కలిసి వచ్చేవిధంగా చంద్రబాబు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. తన వియ్యంకుడు హీరో బాలకృష్ణతో గురువారం(16.05.13) సుదీర్ఘ మంతనాలు జరిపారు. జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ నివాసానికి ఉదయం 11 గంటలకు వెళ్లి మధ్యాహ్నం వరకూ అక్కడే ఉన్నారు. నందమూరి కుటుంబం, తమకు మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు నందమూరి వంశ అభిమానులు చీలిపోయే ప్రమాదం ఉందని ఆయన భయం. దాంతో ఆ కుటుంబానికి సన్నిహితం కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే చంద్రబాబు బాలకృష్ణను కలిశారు. పరిస్థితిని చక్కదిద్దమని అర్ధించినట్లు తెలుస్తోంది. పాపం బాలకృష్ణ మాత్రం ఏం చేయగలరు? పిల్లనిచ్చి ఉన్నారు. బావ కోరికను కాదనలేని స్థితి!
చంద్రబాబు వ్యవహారశైలి నందమూరి వంశంలో, వంశాభిమానులలో చాలా మందికి నచ్చడంలేదు. తన తండ్రి, తాత పెట్టిన పార్టీ అని నందమూరి కుటుంబ సభ్యులలో కొందరికి మాత్రమే అభిమానం ఉంది. పెద్ద కుమార్తె పురంధేశ్వరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరికృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అంతే. అయినా ఆయన యువకుడు. ఆయనకు సినీభవిష్యత్ ఎంతో ఉంది. ఈ పరిస్థితులలో రాజకీయాలలో వేలుపెట్టే ఉద్దేశం అతనికి లేదు. అంతేకాకుండా తండ్రి అసంతృప్తి - బాబాయి వ్యవహార శైలి....ఈ పరిస్థితులలో ఆయన పార్టీ కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాలు కూడా చాలా తక్కువ. నందమూరి అభిమానులు ఎంతో మంది ఆ పార్టీని వీడారు. ఉన్న కొద్ది మంది కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. చంద్రబాబు ఎత్తులకు కాలం చెల్లిపోయింది. ఇంకా అతని మాటలు నమ్మే స్థితిలో నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నా, ప్రజలు లేరు. ఈ వాస్తవాన్ని చంద్రబాబు ఎప్పుడు తెలుసుకుంటారో!
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=62466&Categoryid=28&subcatid=0
0 comments:
Post a Comment