Home » , , , , , , , , , , » ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను

ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను

ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను
sakshi :

హైదరాబాద్ :  ఇంతెత్తున ఉంటాడు.
 చక్కగా నవ్వుతాడు.
 వాయిస్ బాగుంటుంది.
 ఒక టైమ్‌లో...
 అమ్మాయిలకు బాగా నచ్చేసిన హీరో...
 జగపతిబాబు.
 బ్యాడ్ లక్.
 ఇప్పుడా హీరో లేడు. విలనైపోయాడు!
 ఫస్ట్ టైమ్, ఫుల్‌లెంగ్త్ నెగటివ్ రోల్‌లో...
 కనిపించబోతున్నాడు.
 నో ఇష్యూస్. అది క్యారెక్టర్.
 అసలైతే జగపతిబాబు ‘బ్యాడ్ బాయ్’ అనేవాళ్లున్నారు!
 అవునా?
 రిచ్‌గా ఉన్నాడు. డబ్బు పోయింది.
 అది బ్యాడా?!
 మనుషుల్ని నమ్మాడు. నమ్మకం పోయింది.
 అది బ్యాడా?
 ఇంకా ఏవేవో అంటారు ఆయన గురించి.
 అయితే ఎన్ని ‘బ్యాడ్స్’ ఉన్నా...
 వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసే గుడ్ ఒకటి...
 ఆయనలో ఉంది.
 అదే... ఇంటెగ్రిటీ! నిజాయితీ.
 జగపతిబాబు దాచుకున్నది లేదు.
 తన గురించి దాచిపెట్టిందీ లేదు.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 ఆయన  మీకు ఇంకా బాగా నచ్చేస్తారు.


 వీబీ రాజేంద్రప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత కొడుకు మీరు... అంతా గోల్డెన్ స్పూన్ లైఫ్ అనుకుంటా...!
 జగపతిబాబు: అలా ఏం లేదండీ. పుట్టింది గోల్డ్‌స్పూన్‌తో అయినా, పెరిగిందంతా నార్మల్‌గానే! మా నాన్నగారిది పెద్ద సర్కిల్. మద్రాసులో అక్కినేని నాగేశ్వరరావుగారు, శివాజీ గణేశన్‌గారు, రామానాయుడుగారు, గుమ్మడిగారు, మేము పక్కపక్క ఇళ్లవాళ్లం. వాళ్ల పిల్లలు, మేము మంచి ఫ్రెండ్స్. సురేష్, వెంకటేష్, వెంకట్, నాగార్జున, గుమ్మడిగారబ్బాయి సత్తి, శివాజీగణేశన్‌గారబ్బాయిలు రామ్, ప్రభు, మొన్న చనిపోయిన జెమిని రవిశంకర్.. ఇలా అందరం కలిసి ఆడుకునేవాళ్లం. నేను ప్రపంచాన్ని చూసింది వీళ్లతోనే. లోకల్ బీచ్‌కెళ్లినా, ఫస్ట్ టైమ్ సింగపూర్ వెళ్లినా వీళ్లతోనే. సర్కిల్ పెద్దదే అయినా అమ్మ నిరాడంబరంగా పెంచింది. మేం ముగ్గురు అబ్బాయిలం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ నడుచుకుంటూ వెళ్లి, రెండు బస్సులు మారి స్కూల్‌కి, ఎలక్ట్రిక్ ట్రెన్‌లో కాలేజ్‌కీ వెళ్లేవాళ్లం. బస్ టికెట్‌కి పోగా మిగిలిన 60 పైసలతో ఒక పరోటా తినేవాణ్ణి.

 స్కూల్ డేస్ గురించి...

 జగపతిబాబు: నాకు చదవడం అంటే పెద్ద భారం. స్కూల్ అంటే అసహ్యం. ఒక గదికి పరిమితం చేస్తే నేనస్సలు ఉండలేను. అందుకే క్లాస్‌రూమ్‌ను తల్చుకుంటే స్కూల్‌కి వెళ్లబుద్ధయ్యేది కాదు. స్వేచ్ఛని ఇష్టపడే మనస్తత్వం నాది. ఇది చెయ్యి.. అలా చెయ్యి అంటే నావల్ల కాదు. చదువు ఇంపార్టెన్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. లక్కీగా ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను కాబట్టి ఇంగ్లిష్ వచ్చింది. అది అడ్వాంటేజ్ అయ్యింది.

 ఎంతవరకూ చదువుకున్నారు?
 జగపతిబాబు: బీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చదవడం ఇష్టం లేదు. దాంతో వైజాగ్‌లో మా నాన్నగారి ఫర్నీచర్ షోరూమ్‌లోనే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా చేరాను. అక్కడ లేబర్‌వర్క్ కూడా చేశాను. చెయ్యనంటే చదివిస్తారేమోనని భయం. అందుకే ఆ జాబ్ హ్యాపీ అనిపించింది.

 మరి.. హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది?
 జగపతిబాబు: మా షోరూమ్‌కొచ్చినవాళ్లు ‘హీరో’గా చేయొచ్చుగా అంటుండడంతో, మెల్లగా నాలో కూడా ఆ ఆలోచన మొలకెత్తడం మొదలైంది. అది నాలో బలంగా వేళ్లూనుకున్నాకనే ఇంట్లోవాళ్లకి నా అభిలాష గురించి చెప్పాను. పెద్ద నిర్మాత కొడుకుని కాబట్టి... ఆ పరపతిని ఉపయోగించి అవకాశాలు తెచ్చుకోవాలని మాత్రం అనుకోలేదు. నాన్నగారు కూడా అందుకు వ్యతిరేకం.

 మొదట్లో మీ గొంతు బాగాలేదని విమర్శలొచ్చాయి. మీ పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు కూడా. అప్పుడెలా అనిపించింది?
 జగపతిబాబు: నా వాయిస్ మీద నాకెప్పుడూ డౌట్ లేదు. ఇక్కడో ఉదాహరణ చెబుతా. సినిమాల్లోకొచ్చిన కొత్తలో అమితాబ్ బచ్చన్‌ని చాలామంది విమర్శించారు. హీరో మెటీరియల్ కాదన్నారు. ఇంత పొడవేంటి? అన్నారు. కానీ అమితాబ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. నేను ఆయనంతటివాణ్ణి కాదుకానీ, జస్ట్ ఉదాహరణగా చెప్పాను. నన్ను రిజెక్ట్ చేసినప్పుడు ఫీలవ్వలేదు. ఎవరైతే నా వాయిస్‌ని విమర్శించారో, వాళ్లే ఆ తర్వాత ప్లస్ అన్నారు. హీరోగా నేనేంటో ప్రూవ్ చేసుకున్నా.

 మిమ్మల్ని హీరోని చేసే ప్రయత్నంలో మీ నాన్నగారు నష్టపోయారు కదా. ఆ సమయంలో ఏమనిపించింది? వెనక్కి వెళ్లిపోదామనుకున్నారా?
 జగపతిబాబు: నాకు జీవితాన్ని చదవడం ఇష్టం. ఆ చదివే క్రమంలో ఎదురుదెబ్బలు తట్టుకునే స్థయిర్యం ఏర్పడింది. ఏదో రెండు మూడు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన పారిపోయేంత పిరికివాణ్ణి కాదు నేను. నాన్నగారు నాతో ‘సింహస్వప్నం’, ‘అడవిలో అభిమన్యుడు..’ సినిమాలు తీశారు. కోటిన్నర పోయింది. అప్పులు కట్టడానికి మా ఇంటిని 45 లక్షలకు అమ్మేశారు. అప్పుడు మాత్రం బాధపడ్డాను.

 హీరోగా ఓ రేంజ్‌కొచ్చాక.. సడెన్‌గా డౌన్‌ఫాల్ అయ్యారు. కెరీర్ ప్లానింగ్‌లో లోపమా?

 జగపతిబాబు: మీరన్నది కరెక్టే. నా లైఫ్‌ని, కెరీర్‌ని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. ఇది ఫిలాసఫీ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. మొదటినుంచీ నా మైండ్‌లో ఉన్నది ఒక్కటే. మనం ఎప్పుడు పుడతామో తెలియదు.. ఏ క్షణాన చచ్చిపోతామో తెలియదు. మధ్యలోదంతా ఇంటర్వెల్. అంతా రాసి పెట్టి ఉంటుందని, మన చేతుల్లో ఏమీ ఉండదని, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందనీ నమ్ముతాను. అందుకే ప్లానింగ్ లేకుండా వెళ్లిపోతుంటా.

 ఎంత రాసి పెట్టి ఉన్నా, మానవ ప్రయత్నం ఉండాలిగా..!
 జగపతిబాబు: అది కూడా రాసి పెట్టే ఉంటుంది!

 అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
 జగపతిబాబు: కామన్‌సెన్స్‌తో చెబుతున్నా. నేను చాలా పీక్‌లో ఉన్నప్పుడు ‘మీరు గొప్ప నటుడు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీ’ అని కొంతమంది అంటే, పొంగిపోలేదు. ‘ఇప్పుడు నా టైమ్ బాగుంది కాబట్టి అభినందిస్తున్నారు. ఒకవేళ నా టైమ్ బాగాలేదనుకోండి అప్పుడు నన్ను గొప్ప నటుడనరు. కానీ నేను అప్పుడూ అదే జగపతిబాబు.. ఇప్పుడూ అదే జగపతిబాబు.

 అంటే.. టైమ్‌ని నమ్ముతారా?
 జగపతిబాబు: వందశాతం నమ్ముతా. నా కెరీర్‌లో గుడ్, బ్యాడ్ రెండు టైమ్‌లూ ఉన్నాయి. ఈ మధ్య బ్యాడ్‌టైమ్‌లో ఉన్నా. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మంచి టైమ్ ఇప్పుడొచ్చింది. విలన్‌గా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాలో అవకాశం వచ్చింది. మంచి పారితోషికం. ఒకవేళ ఇదే కేరక్టర్ మూడేళ్ల క్రితం వచ్చి ఉంటే కొన్ని చెత్త సినిమాలు చేసి ఉండేవాణ్ణి కాదు. అప్పుడు టైమ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి చేయకూడని సినిమాలు చేశానేమో. ఇప్పుడు టైమ్ బాగుంది కాబట్టి ఒకేరోజులో ఈ సినిమా ఓకే అయింది.

 సో... ఇప్పుడు విలన్‌గా చేయడం ఎలా అనిపిస్తోంది?
 జగపతిబాబు: ఎవరైనా హీరోగా చేయడానికే ఇష్టపడతారు. కానీ ఇంతకాలం విలన్లను నేను కొట్టాను... ఈసారి నన్ను కొట్టే అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు లొకేషన్లో బాలకృష్ణగారు వస్తుంటే, అందరూ ‘హీరోగారు వస్తున్నారు’ అంటారు. అప్పుడు కొంచెం కలుక్కుమంటుంది. ఎందుకంటే పాతికేళ్లుగా నా షూటింగ్ లొకేషన్లో హీరో అంటే నేనే! ఇప్పుడు విలన్ అంటారు. హీరో అనే ఫీలింగ్‌ని ఓవర్‌కమ్ అవ్వడం నేర్చుకోవాలి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్. అందుకని ఇలాంటి వాటినుంచి త్వరగా బయటపడగలుగుతున్నాను.

 ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మీరు పూర్ అని టాక్ ఉంది..?
 జగపతిబాబు: కరెక్టే! ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడంవల్లే నా లైఫ్ గాడి తప్పింది. ఈ కారణంగా మానసికంగా చాలా నలిగిపోయిన మాట వాస్తవం. షూటింగ్ లేక ఇంటిపట్టున కూర్చున్నప్పుడు బాధపడ్డాను. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందనే రకం నేను. అలాగని ఏం చేయకుండా ఇంట్లో కూర్చోలేదు. నా ప్రయత్నాలు నేను చేశా. అయినా ఇప్పుడేమైంది? లక్కీగా నాలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇంకా బోల్డన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా. హీరోగా, విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా... ఏదైనా చేయగలను. నేను పోగొట్టుకున్న డబ్బు మళ్లీ సంపాదించుకుంటాను.

 దేవుణ్ణి నమ్ముతారా?
 జగపతిబాబు: ప్రస్తుతానికి నేను భక్తుణ్ణి కాదు. దేవుడు ఉన్నాడని అనను. లేడని కూడా చెప్పను. రేపు టైమ్ వేరే విధంగా ఉందనుకోండి భక్తుణ్ణి అవ్వొచ్చేమో. సో.. భక్తి కలగడం కూడా టైమ్‌ని బట్టే ఉంటుందనుకుంటా!

 ‘జగపతిబాబు’కి ఇగో ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. ఎందుకా ఇమేజ్ తెచ్చుకున్నారు?
 జగపతిబాబు: నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నేను విలన్‌గా చేస్తున్నానని నన్ను వేరే రకంగా ట్రీట్ చేయొద్దు. నాకివ్వాల్సిన గౌరవం ఇవ్వాలని ముందే చెప్పా. అంతే తప్ప లొకేషన్‌కి వెళ్లి సరిగ్గా ట్రీట్ చేయలేదని గొడవపడను. ఇలా ఏదైనా ముందే ఓపెన్‌గా చెప్పేస్తా. అది ఇగో అంటే నేనేం చేయగలను? నేనెవరి దగ్గర్నుంచీ ఏమీ ఎదురు చూడను. నా లైఫ్ నేను బతుకుతున్నాను. ఎవర్నీ నమ్మను. ఇవాళ్టి ప్రపంచంలో దాదాపు దొంగలే ఉన్నారు. అయితే ఒక్కటి.. ఎవరో మోసం చేశారని నేను ఫీలవ్వడంలేదు. మోసపోవడానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చాం? అనుకుంటాను.

 మీ మాటల్ని బట్టి... చాలామందిని నమ్మి మోసపోయారనిపిస్తోంది...
 జగపతిబాబు: ఫైనాన్షియల్‌గానే మోసపోయాను. పేర్లు అనవసరం. మనుషులను నమ్మకపోతే ఎవర్ని నమ్మాలి? అనుకునేవాణ్ణి. కొన్ని చేదు అనుభవాల వల్ల ఆ అభిప్రాయం మారింది. బేసిక్‌గా హార్ట్‌ని నమ్మేవాణ్ణి. కానీ ఇప్పుడు నోట్లని నమ్మాల్సి వస్తోంది. మన దగ్గరకు ఎంతోమంది వస్తారు. వీణ్ణి దోచేద్దామని స్కీమ్ వేసుకుని వచ్చేవాళ్లని కనిపెట్టలేం. ఆ పరంగా చాలా మోసాలు జరిగాయి. అప్పట్నుంచి నమ్మకం పోయింది. మనల్ని మనం కాపాడుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడానికి కొంత టైమ్ పట్టింది. మళ్లీ టైమ్‌కే వస్తున్నా కదా! (నవ్వుతూ)

 మీ లైఫ్‌స్టయిల్ కూడా చాలా లగ్జరీగా ఉంటుందట?
 జగపతిబాబు: అవును. జనరల్‌గా లగ్జరియస్‌గా ఉంటాను. డబ్బుంటే బయటికెళ్లి ఖర్చుపెడతాను. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను.

 మోసపోవడంతో పాటు గోవాకెళ్లి కెసినోలు ఆడటం వల్ల కూడా మీ ఆర్థిక పరిస్థితి తారుమారయ్యిందని వినికిడి...
 జగపతిబాబు: గోవా మాత్రమే కాదు. లాస్‌వేగాస్ కూడా వెళ్లాను. అయితే అక్కడకు వెళ్లడంవల్లే ఆస్తులు పోయాయనడం కరెక్ట్ కాదు. నా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వెళ్తాను.  వాళ్లు పోగొట్టిన డబ్బులు కూడా నా అకౌంట్లో వేస్తే ఎలా? కెసినోల్లో మహా అయితే 30 లక్షలు పోగొట్టి ఉంటానేమో! దానివల్లే ఆస్తులు కరిగిపోవుగా!

 కెసినోలంటే ఎందుకంత క్రేజ్?
 జగపతిబాబు: ఆడటం అనేది ఒక పాయింట్ మాత్రమే. నాకు అక్కడి వాతావరణం చాలా ఇష్టం. చాలా రిచ్‌గా ఉంటుంది. లాస్‌వేగాస్‌లో అమ్మాయిలు చాలా బాగుంటారు. పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. లక్షలు తెచ్చి ఆడుతుంటారు. వాళ్ల గెలుపు, ఓటములు చూడటం కూడా నాకో ఇంట్రస్ట్. అలాగే అమ్మాయిలు ట్రేల్లో డ్రింక్స్ పెట్టుకుని, స్టయిల్‌గా నడుచుకుంటూ వచ్చి సర్వ్ చేస్తుంటే చూడటం ఇష్టం. అన్ని టేబుల్స్ తిరిగి చూసేవాణ్ణి. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి.

 పెళ్లయ్యి, ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మీరు.. ఇలా ఎంజాయ్‌మెంట్ కోసం గోవా, లాస్‌వేగాస్ వెళ్లడం కరెక్టేనా?
 జగపతిబాబు: ఓ రెండు మూడేళ్లు ఆలోచించలేదు... ఇప్పుడు ఆలోచిస్తున్నా! ఆర్థికంగా కూడబెట్టుకోలేదనే పశ్చాత్తాపం ఉన్నప్పటికీ లైఫ్‌ని ఎంజాయ్ చేశాననే సంతృప్తి ఉంది. నా సంపాదన నా కోసం కూడా. నా ఆనందాలను త్యాగం చేసేస్తే ఇంట్లోవాళ్ల మీద నిరాశా, నిస్పృహలు తప్ప ప్రేమ ఉండదు.

 ‘అమ్మాయిల మానస చోరుడ’నే బ్రాండ్ ఇమేజ్ మీపై బాగా ఉన్నట్టుంది?
 జగపతిబాబు: (నవ్వేస్తూ) ఎవరికి వాళ్లు అలా నాపై బ్రాండ్ వేసేశారు. నిజం చెప్పండి... అందమైన ఆడవాళ్లను ఏ మగాడు ఇష్టపడడు? నాకు ఆడవాళ్లంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. వాళ్ల సమక్షాన్ని ఆస్వాదిస్తాను. ఆడవాళ్ల సమక్షం అంటే ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరంలేదు. వాళ్లతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా కొంతమందితో క్లోజ్‌గా అసోసియేట్ కావడం వల్లనో ఏమో నాకు అలాంటి ఇమేజ్ వచ్చేసింది. అలాగని నేను అందరితోనూ క్లోజ్‌గా మూవ్ కాను. బేసిగ్గా ముందు నాకా మనిషి నచ్చాలి. నచ్చడమంటే అందం ఒక్కటే కాదు. వ్యక్తిత్వం కూడా. ఆత్మవిశ్వాసం కనబరిచే ఆడవాళ్లను చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్‌ని బాగా లైక్ చేస్తాను.

 సౌందర్య కారణంగా మీ వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు వచ్చాయని అప్పట్లో ఓ వార్త వచ్చింది. సౌందర్యను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట?
 జగపతిబాబు: అది పచ్చి అబద్ధం! నాకూ సౌందర్యకు చాలాసార్లు ముహూర్తం పెట్టారు. నా భార్యకే ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి నేను, మా ఆవిడ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరో ఫోన్ చేసి, ‘పన్నెండున్నరకి సౌందర్యతో మీ పెళ్లని విన్నాము’ అన్నారు. అప్పుడు టైమ్ పన్నెండు పదయ్యింది. ఎవరో ఏదో ఊహించేసుకుని ఏదేదో చెప్పేస్తుంటారు. అఫ్‌కోర్స్ సౌందర్య నాకు చాలా క్లోజ్. తనెంత క్లోజో తన అన్నయ్య అమర్ కూడా అంతే క్లోజ్. ఆ విషయం బయటికి రాదు కదా. ఒకసారి నేనెవర్నో రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కెళ్లాను. అదే సమయంలో సౌందర్య ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది. దాంతో సౌందర్య కోసమే వచ్చానని ప్రచారం చేశారు. సౌందర్య, అమర్ నాకు మంచి ఫ్రెండ్స్. ఓసారి నాకు 20 లక్షలు అవసరమైతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమర్ ఇచ్చాడు. ఆ తర్వాత నేను వెనక్కి ఇచ్చేశాను. మా మధ్య నమ్మకంతో కూడిన మంచి స్నేహం మాత్రమే ఉండేది. ఏదో కవర్ చేయడానికి నేనిలా చెప్పడంలేదు. నిజం చెప్పాను. ఇక్కడ బోయ్, గాళ్ అని కాదు.. ఫ్రెండ్‌షిప్ అనేది ఒకటుంటుంది. కానీ దాన్ని దాటేసి ఆలోచిస్తారు. అదే ప్రాబ్లమ్!

 సౌందర్య మరణ వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది?

 జగపతిబాబు: అప్పుడు మలేసియాలో ఉన్నాను. మా అన్నయ్య ఫోన్ చేసి, ‘బ్యాడ్ న్యూస్... సౌందర్య చనిపోయింది’ అన్నాడు. నేనేమీ అనలేదు. ‘అమర్ కూడా చనిపోయాడా? చనిపోయి ఉంటే ఫోన్ చేయొద్దు’ అన్నాను. నాకు తెలుసు... అమర్ కూడా చనిపోయి ఉంటాడని! ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధం అలాంటిది.

 మీ మీదున్న ఇమేజ్ కారణంగా, సౌందర్య విషయంలోనూ మీ భార్య ఎప్పుడూ అభద్రతాభావానికి గురవ్వలేదా?
 జగపతిబాబు: ఫీలయ్యిందో లేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. పెళ్లప్పుడు నేను తనతో ఒకటే చెప్పాను. ‘సినిమా ఇండస్ట్రీ అంటే ఎఫైర్లు ఉంటాయి. నువ్వు మెంటల్లీ ప్రిపేర్ అయితేనే ఇండస్ట్రీకి వెళతాను. లేకపోతే లేదు’ అని! ‘ఎక్కడికైనా వెళ్లండి.. కానీ ఇంటికి రండి’ అని కూల్‌గా చెప్పింది తను. అప్పుడప్పుడూ ఎవరైనా ఫీలవుతారు. నేను తనను బాగా చూసుకుంటాను. తను కూడా నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. అంత అర్థం చేసుకునే భార్య లభించడం ఏ హీరోకైనా అదృష్టం. ఫైనాన్షియల్‌గా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కూడా మా మధ్య ఏదైనా చిన్నపాటి డిస్కషన్స్ జరిగి ఉంటాయేమో కానీ.. పెద్ద పెద్ద డిస్కషన్లు జరగలేదు.

 మీది ఎరేంజ్డ్ మ్యారేజా? లవ్వా?
 జగపతిబాబు: లవ్ మ్యారేజే! అయితే పెద్దలను ఒప్పించే ప్రక్రియలో చిన్నపాటి చర్చలు కూడా జరిగాయి. సరిగ్గా అప్పుడు నేను వైజాగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఖాళీ దొరికితే పిట్టగోడమీద పడుకుని వాక్‌మాన్ పెట్టుకుని పాటలు వినేవాణ్ణి! కొండలు, చెట్లు.. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. దాంతో పాటలు వింటుంటే, నిద్ర పట్టేసింది. నిద్రలో మంచం మీద పక్కకు తిరిగినట్లుగా తిరిగా. అంతే.. 30 అడుగుల పైనుంచి కిందపడిపోయా. బాగా దెబ్బలు తగిలాయి. నేను అలా పడిపోవడాన్ని మా నాన్నగారు వేరేలా అర్థం చేసుకున్నారు. ప్రేమకోసం ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాననుకుని, పెళ్లికి ఒప్పుకున్నారు. భలే కనెక్ట్ అయ్యిందనుకుని, నేను కూడా సెలైంట్ అయిపోయా.

 ఫాదర్‌గా మీరెంతవరకు బెస్ట్?
 జగపతిబాబు: నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ. ఫాదర్‌లా ఉండను. ఫ్రెండ్‌లా ఉంటాను. వాళ్లేం అడిగినా కాదనను. కానీ, ఫైనాన్షియల్ వైజ్‌గా నేను గుడ్ ఫాదర్ కాదు.

 ఫైనాన్షియల్ స్టేటస్ గురించి పిల్లలు ఏం అంటుంటారు?
 జగపతిబాబు: పెద్దమ్మాయి ఎప్పుడూ అనలేదు. చిన్నమ్మాయికి ఇప్పుడు పదిహేనేళ్లు. ఏమో.. రేపు ఎప్పుడైనా అంటుందేమో! నా పిల్లలు అడిగినదానికన్నా ఓ రూపాయి ఎక్కువే ఇస్తాను. అమెరికాలో చదువుకుంటానంటే ఓకే అన్నాను. ఆర్థిక ఇబ్బందులేమైనా ఉంటే ఆ బాధేదో నేను పడతాను కానీ నా పిల్లలకు తెలియనివ్వను. ఒకవేళ నాకేమైనా అయ్యిందనుకోండి.. అప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో నా పిల్లలకు కావాల్సిన సేఫ్టీ క్రియేట్ చేశాను. వాళ్ల భవిష్యత్తు సెక్యూర్టీ కూడా చూసుకున్నాను. నేనేం మరీ బాధ్యతారాహిత్యమైన ఫాదర్‌ని కాను. కాకపోతే జీవితం నేర్పిన పాఠాలవల్ల ఇప్పుడు ఖర్చు తగ్గించేశాను. జాగ్రత్తపడుతున్నాను. అయినా నా పిల్లలు కరెన్సీ గురించి ఆలోచించరు. ‘మా నాన్నకి మేమంటే చాలా ప్రేమ’ అనే నమ్మకం వాళ్లకుంది. మా నాన్నను నేనెప్పుడూ డబ్బు అడగలేదు. చాలామంది ‘మా బాబు ఏం ఇచ్చాడు.. ఏమీ ఇవ్వలేదు’ అని తిట్టడం మా బంధువులో కూడా చూశాను. వాళ్లని తెగ తిట్టేవాణ్ణి.

 మీరు సిగరెట్లు బాగా కాలుస్తారు కదా..!
 జగపతిబాబు: అవును. అది తప్పే. నాకా విషయం తెలుసు. నన్ను చూసి నా అభిమానులూ ఫాలో అవుతారనీ తెలుసు. ‘అంతఃపురం’ చూసి చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. అది గొప్పగా అనిపించలేదు... బ్యాడ్‌గా ఫీలయ్యాను.

 అసలెప్పుడు అలవాటయ్యింది?
 జగపతిబాబు: మా మామయ్య కాల్చేసిన చుట్టతో మొదలైంది. అది అలవాటుగా మారిపోయింది. నేనెప్పుడూ రాడికల్. ఎంత రాడికల్ అంటే.. ఎక్కడైనా టైస్టులు ఉన్నారని తెలిస్తే, వాళ్లని చూడ్డానికి వెళ్లేవాణ్ణి. పోలీసుల గన్ ఫైరింగ్‌ని స్వయంగా చూసినవాణ్ణి. అన్నీ చూడాలనుకుంటాను. అన్నీ ట్రై చేయాలనుకునే మనస్తత్వం. అన్ని ఆశ్రమాలకు వెళ్లాను. హిమాలయాలకు వెళ్లాను. ధ్యానం చేశాను. ఈ మొత్తం ఒక రౌండ్ చూసేశాను.. చేసేశాను. ఇక చాలని ఫిక్స్ అయ్యాను.

 ఎప్పుడైనా సిగరెట్ మానడానికి ట్రై చేశారా?
 జగపతిబాబు: చాలా ప్రయత్నం చేశాను. కొకైన్, హెరాయిన్ అన్నిటికన్నా సిగరెట్ చాలా వరస్ట్ డ్రగ్. అందుకే దానికి దూరంగా ఉండాలనుకున్నాను. లాస్ ఏంజిల్స్‌లో సిగరెట్ మాన్పించడానికి ఏదో రేడియాలజీ చేస్తున్నారని విని, వెళ్లాను. దాదాపు 20, 30 లక్షలు ఖర్చు పెట్టాను. అక్కడా మోసమే ఎదురైంది. డబ్బులు పోయాయి కానీ నా సిగరెట్ నాకు వెనక్కొచ్చేసింది (నవ్వుతూ).

 మిమ్మల్ని కొంతమంది నిర్మాతలు శాటిలైట్ రైట్స్ కోసం వాడుకుని, సినిమాలు చేశారు. అలా వాడుకుంటున్నారని మీరు గ్రహించలేదా? లేక డబ్బు కోసం చేశారా?
 జగపతిబాబు: నాకంత దూరపు ఆలోచన ఉండదు. ఎంత శాటిలైట్ హక్కులు వస్తాయో కూడా ఊహించేవాణ్ణి కాదు. ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు చేయొచ్చు కదా అనుకున్నాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే డబ్బుల కోసమే చేశానని చెప్పొచ్చు.

 అడగనిదే అమ్మయినా పెట్టదంటారు కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరినైనా అవకాశాలు అడిగారా?

 జగపతిబాబు: నేను పరిశ్రమకు వచ్చి దాదాపు ఇరవయ్యేళ్లయ్యింది. ఇప్పటివరకు ఏ సినిమా ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు అడగలేదు. నాతో సినిమా చేయాలనుకున్నవాళ్లు ఎలానూ చేస్తారు. చేయాలనుకోనివాళ్లు అడిగినా చెయ్యరు. ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ దగ్గర ఇదే విషయం గురించి చర్చ వచ్చింది ‘‘నేను నీకు బాగా తెలుసు కదా.. నన్ను ఛాన్స్ అడగవు ఎందుకని?’’ అన్నాడు రాము. దానికి సమాధానంగా నేను ‘రామూ... నువ్వు మంచి డెరైక్టర్. ఒక మంచి డెరైక్టర్‌కి కళాకారుడు కనబడితే, ఏ మూల దాగున్నా తనే వచ్చి అడుగుతాడు. ఒకవేళ నేను అడిగి, నువ్వు అవకాశం ఇస్తే.. నీమీద నాకు మర్యాద పోతుంది. అదే ఓ కళాకారుడ్ని గుర్తించి నువ్వు సినిమా చేశావనుకో.. అప్పుడు నాకు గౌరవం ఉంటుంది’’ అన్నాను. ఫైనల్‌గా నేను ‘గాయం’ కి సూట్ అవుతానని తీసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతా... ఎలాగైనా అవకాశాలు కొట్టేయాలని మందు అలవాటున్న నిర్మాతలకు అది ఆఫర్ చేసి, వీక్ మూమెంట్‌లో అవకాశం అడగొచ్చు. నాకది ఇష్టం ఉండదు. షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత బిజినెస్ మాట్లాడను. మందు కొట్టిన తర్వాత అస్సలు మాట్లాడను. ఒకరి వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకునే మనస్తత్వం కాదు నాది. అలా చేస్తే అది ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క అని నా అభిప్రాయం.

 జగపతిబాబుకి అహం ఎక్కువన్నా ఫర్వాలేదు. నేను మాత్రం ఎవర్నీ అవకాశాలు అడగను. ముక్కుసూటిగానే మాట్లాడతాను. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. అబద్ధం ఆడాలంటే తెలివి ఉండాలని ఆ మధ్య ఏయన్నార్‌గారు అన్నారు. ఆ మాటలు నిజం. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకే అబద్ధం ఆడకపోవడమే బెటర్. నిజాయితీగా బతకడంలో ఓ ఆనందం ఉంది. జగపతిబాబు ఎప్పుడూ అలానే బతికాడు... బతుకుతాడు!

 - డి.జి. భవాని

 సుస్మితాసేన్ మా ఫ్యామిలీలో ఓ మెంబర్ అయ్యింది...
 మా ‘జగపతి’ బేనర్‌పై సినిమాలు తీసే ఆలోచనే లేదు. ఎందుకంటే నాన్నగారిలా నేను కూడా బ్యాడ్ బిజినెస్‌మేన్. హాయిగా నిర్మాతలు వచ్చి డబ్బులిస్తుంటే, యాక్ట్ చేయడం సుఖం.

 మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరికీ డబ్బు పిచ్చి లేదు. మా పెద్ద అన్నయ్య రామ్‌ప్రసాద్ మనీ మేనేజ్‌మెంట్‌లో బెస్ట్. రెండో అన్నయ్య యోగేంద్రకుమార్ అచ్చం నాలానే ఉంటాడు. నా టైపే.

 మా పెద్దమ్మాయి మేఘన అమెరికాలో, చిన్నమ్మాయి లేఖ పుణెలో చదువుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్నకు బెంజ్ కారు ఉంది.. అంటూ పోటీలు పడటం, పనోళ్లను ఒరేయ్ అరేయ్ అనడం... ఇవన్నీ నాకు నచ్చదు. అందుకే అక్కడికి పంపించాను. మనుషులను ఎలా గౌరవించాలి? లాంటి ఎన్నో విలువలను నేర్పించే ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదువుతున్నారు.

 మా అన్నయ్య రామ్‌ప్రసాద్‌కి సుస్మితాసేన్ మంచి ఫ్రెండ్. నాగార్జున ద్వారా అన్నయ్యకు తనతో పరిచయం అయ్యిందనుకుంటా. అలా మా ఫ్యామిలీ అందరితో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. బేసిక్‌గా తను చాలా నైస్ పర్సన్. సింపుల్‌గా ఉంటుంది. ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు తను మా ఫ్యామిలీలో ఓ మెంబర్‌లా అయ్యింది.

 చిన్నప్పుడు గోలీ సోడా బాగా తాగేవాణ్ణి. ఒక్క సోడా ఖరీదు పది పైసలుండేది. గోలీ సోడా కొడుతుంటే ఆ సౌండ్ భలే ఉంటుంది.

 పెళ్లనేది ఓ మంచి అనుబంధం. నేను కట్నానికి వ్యతిరేకం. నేను తీసుకోలేదు. ఒకవేళ నాకు కొడుకులు ఉండి ఉంటే కట్నం తీసుకోనిచ్చేవాణ్ణి కాదు. దమ్మున్న మగాడైతే నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. తండ్రి ఇస్తాడని, భార్య తెస్తుందని ఎదురు చూడకూడదన్నది నా అభిప్రాయం.

 భూమిలో పాతిపెట్టి మర్చిపోయారు
 నాకు ధ్యానం చేయడం ఇష్టం. ‘జగపతి’ సినిమా అప్పుడు నన్ను కాపాడింది అదే. శవపేటికలో నన్ను పెట్టి, దానిపైన కళ్యాణమండపం సెట్‌తో షూటింగ్ ప్లాన్ చేశాం. భూమిలో నిజంగానే నన్ను పాతిపెట్టమన్నాను. ఆ సీన్ చేయడానికి నేనే ఒప్పుకున్నాను. మూడు టేక్స్‌కి కానీ సీన్ ఓకే అవలేదు. ఆ టేక్స్ తర్వాత, మండపం సెట్ తీసేశారు. కానీ, నన్నెక్కడ పాతిపెట్టారో మర్చిపోయారు. దాంతో టెన్షన్‌తో తవ్వడం మొదలుపెట్టారు. లోపల ఆక్సిజన్ లేదు. సిలిండర్ కొనమంటే, మా నిర్మాత కొనలేదు. నాకు ధ్యానం చేసే అలవాటుంది కాబట్టి, శ్వాసను ఓ పద్ధతిలో పీల్చి వదలడం మొదలుపెట్టాను. దానివల్ల ప్రాణాపాయం నుంచి బయటపట్టాను. నేను లోపల అలా శ్వాస తీసుకుంటుంటే, ఈలోపు నన్ను పాతిపెట్టిన ప్లేస్‌ని యూనిట్ సభ్యులు గుర్తుపట్టి, బయటకు తీశారు. నేను జాతకాలను పెద్దగా నమ్మను. కానీ ఆరోజు ఒకావిడ ఫోన్ చేసి, ‘మీరు బాగానే ఉన్నారా?’ అనడిగారు. బాగానే ఉన్నానని చెప్పాను. ‘మీకు మరణగండం ఉంది.. అందుకే అడిగా’ అన్నారావిడ.
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger