Home » , , , , » ఆరడుగులుంటాడా... ఏడడుగులేస్తాడా...

ఆరడుగులుంటాడా... ఏడడుగులేస్తాడా...

ఆరడుగులుంటాడా... ఏడడుగులేస్తాడా...
అందరమ్మాయిల్లాగానే నమ్రత కూడా ఇలాంటి పాట పాడుకున్నారా?
మహేష్ అంటే అమ్మాయిల కలల రాజకుమారుడు.
అలాంటివాడు ఓ అమ్మాయి ముందు మోకరిల్లి నువ్వే నా ప్రపంచం... నువ్వే నా సమస్తం అనగలడా?
కానీ అన్నాడు. నమ్రతను ఏరికోరి వరించాడు.
పెళ్లై ఇన్నేళ్లయినా... ఇద్దరు పిల్లలు ఉన్నా...
ఇప్పటికీ మహేష్, నమ్రత అప్పుడే ప్రేమలో పడ్డవాళ్లలాగా అనిపిస్తారు.
వాళ్ల దాంపత్యం, సాన్నిహిత్యం గమనిస్తే...
ఇంతకన్నా గొప్ప స్నేహితులు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది.
నిజంగానే... గొప్ప ప్రేమికులు కావాలంటే...
మంచి భార్యాభర్తలు అవ్వాలంటే... 
మహేష్, నమ్రతల్లాగా చక్కగా స్నేహించుకోవాలి.
సెల్యులాయిడ్‌కి మహేశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షనయితే...
మహేష్‌కి నమ్రతే ఫుల్ డోస్ ఆఫ్ ఎనర్జీ!
వాళ్లిద్దరి రిలేషన్ ప్యూర్లీ పర్సనల్.
ఆ పర్సనల్ ఫైల్‌లోని కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు...
సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమికి నమ్రత ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో...


ఇందిర: మీ చిన్నతనం గురించి...
నమ్రత: ముంబైలో పుట్టి పెరిగాను. నేను, శిల్ప - అమ్మా, నాన్న, నానమ్మ, తాతయ్యలతో పెరిగాం. అమ్మమ్మ (మీనాక్షి శిరోద్కర్) మరాఠీలో చాలా ఫేమస్ హీరోయినే అయినా, అమ్మ (వినీత శిరోద్కర్) కూడా ముంబైలో ఫేమస్ మోడలే అయినా, ఇంటి వాతావరణం మాత్రం హైఫైగా ఉండేది కాదు. మామూలు మిడిల్‌క్లాస్ వాళ్లు ఎలా ఉంటారో అలాగే ఉండేవాళ్లం.

ఇందిర: పర్సనల్లీ మీ గురించి...
నమ్రత: చిన్నప్పటినుంచి చాలా బ్యాలెన్స్‌డ్‌గా, గ్రౌండెడ్‌గా ఉండేదాన్ని. మంచి స్టూడెంట్‌ని. ఇంకా చెప్పాలంటే స్కూల్లో టాపర్‌ని! అయితే, ఇంటర్ సెకండియర్ దాకానే చదివాను. దానికి కారణం 11, 12 క్లాసుల్లో ఉండగానే మోడలింగ్ మొదలెట్టాను. 12 అవగానే మిస్ ఇండియాకు ప్రిపేర్ అయ్యి, ఆ పోటీలో గెలిచాను. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడలేదు.

ఇందిర: వీటన్నిటికీ అమ్మమ్మ ఇన్‌స్పిరేషనా..?
నమ్రత: నో డౌట్, అమ్మమ్మ మంచి నటి, తనంటే నాకు చాలా గౌరవమే కానీ, నాకు తను ఇన్‌స్పిరేషన్ అనడానికి మాత్రం లేదు. బహుశా దానికి కారణం అమ్మ వాళ్ల పెళ్లి టైంకే అమ్మమ్మ నటించడం మానేయడం, తన సినిమాలు నేను పెద్దగా చూడకపోవడం కావచ్చు.. అసలు నన్ను మోడలింగ్‌లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన, మిస్ ఇండియాలో పాల్గొనేలా చేయాలన్న ఆలోచన అమ్మదే! మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ రాజాధ్యక్ష (ఫేమస్ ఫోటోగ్రాఫర్)తో అమ్మ ఓసారి నా ఫోటో షూట్ చేయించింది. అదే టైంలో గార్డెన్ వాళ్లు ఓ కొత్త ఫేస్ కోసం చూస్తున్నారని తెలియడంతో ఆ ఫోటోలను వాళ్లకు పంపించింది. అలా... చేయడం చేయడమే పెద్ద కంపెనీకి మోడలింగ్ చేయడంతో దాన్ని ఫాలో అవుతూ ఇంకా చాలా అవకాశాలు వచ్చాయి. దాని తర్వాత ఫ్యాషన్ షోలు, సినిమా ఆఫర్లు... లైఫ్ బిజీ అయిపోయింది.

ఇందిర: ఎంజాయ్ చేసేవారా? ఎనీటైం ఫీల్డ్ నచ్చకపోవటాల్లాంటివి ఉండేవా..?
నమ్రత: అసలు నేను ఈ ఫీల్డ్‌లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు గుర్తుండి ఆ టైంలో నేను ట్రావెల్ చేసే జాబ్ చేస్తే బాగుంటుందనుకునేదాన్ని... అందుకే ఎయిర్‌హోస్టెస్ అవ్వాలనుకున్నాను. కానీ, అమ్మకి అది ఇష్టంలేదు... ఆ ఫ్లైయింగ్ అవీ నచ్చక! కానీ, అమ్మ ఇంట్రస్ట్ వల్ల ఇటువైపుకి వచ్చేశాను. ఒకసారి వచ్చాక మాత్రం ఎంజాయ్ చేయడం మొదలెట్టాను. ఈ క్రమంలో ఎందరో గొప్ప వ్యక్తుల్ని కలిశాను. మంచి ఫ్రెండ్స్‌ని చేసుకున్నాను. ఇప్పటికీ వాళ్లతో (మోడలింగ్ ఇండస్ట్రీ) క్లోజ్‌గానే ఉంటాను. దాని తర్వాత వెళ్లిన సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే... ఓవరాల్‌గా గుడ్ జర్నీ, గ్రేట్ మెమరీస్!

ఇందిర: తెలుగు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి?
నమ్రత: అందరు హీరోయిన్లలానే నాకు కూడా మేనేజర్ ద్వారానే మొదటిసారి తెలుగులో ‘అంజి’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో తెలుగు సినిమా అనగానే... చేయాలా? వద్దా? అనుకున్నాను. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలీక! కానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ బాగానే ఉండడంతో మహేష్‌తో ‘వంశీ’ సినిమా చేయడానికి కూడా ఒప్పుకున్నాను. 

ఇందిర: మొదటిసారి మహేష్‌ను చూడగానే ఏమనిపించిందో గుర్తుందా?
నమ్రత: యా... అఫ్‌కోర్స్, క్లియర్‌గా గుర్తుంది! వంశీ సినిమా ముహూర్తం టైంలో మొదటిసారి తనని కలిశాను. చాలా రిజర్వ్‌డ్‌గా, క్వైట్‌గా కూర్చున్నారు. కనీసం హలో కూడా చెప్పలేదు. అప్పుడనుకున్నా... ‘ఓ గాడ్, ఈ అబ్బాయితోనా అన్నిరోజులు కలిసి షూటింగ్ చేయాల్సింది’ అని! సరే, షూటింగ్ మొదలైంది. న్యూజిలాండ్ వెళ్లాం. నేనే ఓరోజు ఈ ఇబ్బందిని తొలగించాలనుకుని తనతో కూర్చుని కాసేపు మాట్లాడా. మాట్లాడాక తెలిసింది... తను చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని, విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని, తను మాట్లాడడం మొదలెడితే నవ్వు ఆపలేమని, తనతో కూర్చుంటే టైం అసలు తెలీదని! తను కూడా కొన్నిరోజులకి ఫ్రీగా ఫీలయ్యి, మాట్లాడడం మొదలెట్టారు. మెల్లగా కలిసి, డిన్నర్‌లకి, సినిమాలు చూడ్డానికి వెళ్లేవాళ్లం. ఇద్దరి స్నేహం అలా మొదలై, ఒకరినొకరు ఇష్టపడేదాకా వచ్చింది.

ఇందిర: పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మొదట ఎవరికి వచ్చింది?
నమ్రత: ఒకరికని లేదు ఇద్దరిదీ. ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఏ లెవెల్ దాకా వెళ్లిందంటే... ఒకరినొకరు విడిగా ఉండడం చాలా కష్టమని తెలుసుకున్నాం. అయితే, ఆ టైంలో తన కెరీర్‌లో తను, నా కెరీర్‌లో నేను చాలా బిజీగా ఉండడంతో కలవడం చాలా కష్టమయ్యేది. అలా అని కలవకుండా ఉండలేకపోయాం. ఇక అప్పుడు ఇద్దరికీ అర్థమైంది... దీనికి మార్గం పెళ్లేనని! అందుకని నా ఫిల్మ్ ఎసైన్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి ఇంట్లోవాళ్లకి చెప్పాం. 

ఇందిర: చెప్పగానే వాళ ్లరియాక్షన్?
నమ్రత: పెళ్లయితే చేసుకుందాం అనుకున్నాం కానీ, నాకు తెలుసు... ఏరకంగా తీసుకున్నా నేను వీళ్ల ఫ్యామిలీ కోరుకునే కోడలిని కాదని! మొదటిగా నేను ఆంధ్రా అమ్మాయిని కాదు... పెళ్ళి సంబంధాలలో వచ్చే నార్మల్ అమ్మాయిని అంతకన్నా కాదు... అందులోనూ ఇక్కడ కులాలు, పట్టింపులు చాలా ఉంటాయి. సో, నాలాంటి అమ్మాయితో పెళ్లి అంటే డెఫినిట్లీ వీళ్లింట్లో అది ఇష్యూనే అనుకున్నాను! కానీ గొప్ప విషయం ఏంటంటే... మహేష్ వాళ్లింట్లో చెప్పగానే కృష్ణగారితో సహా అందరూ వెంటనే ఆమోదించారు. బహుశా వాళ్లకు తెలుసను కుంటా... మహేష్ ఏది చేసినా ఆలోచించి చేస్తారని, సరైన నిర్ణయం తీసుకుంటారని! ఇక్కడ నేనొక విషయం తప్పకుండా చెప్పాలి... ఆ టైంలో మహేష్ సిస్టర్స్ పద్మ, మంజుతోపాటు పద్మ భర్త జయ్ గల్లా, మంజు భర్త సంజయ్... నలుగురూ మాకిచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు! ఇంకా చెప్పాలంటే వాళ్లు నలుగురూ లేకపోతే మా పెళ్లి అయ్యేదే కాదు. 

ఇందిర: మరి మీ ఇంట్లో వాళ్ల సంగతి..?
నమ్రత: వాళ్లకి కూడా మొదట మహేష్ తెలీదు... కృష్ణగారి కొడుకని తప్ప! చెప్పగానే వాళ్లకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒకసారి మహేష్‌ని కలిశాక మాత్రం వాళ్లకున్న డౌట్స్ అన్నీ పోయాయి. వెంటనే ఓకే చెప్పారు.

ఇందిర: పెళ్లి ముంబైలో సీక్రెట్‌గా... గుట్టుచప్పుడు కాకుండా చేసుకున్నారు.. ఎందుకలా?
నమ్రత: గుట్టుచప్పుడు కాకుండా కాదు, పెద్ద హంగామా లేకుండా చేసుకున్నాం అనండి! నేను, మహేష్ ఇద్దరం చాలా ప్రైవేట్ పర్సన్స్! చాలా విషయాల్లో ఇద్దరివీ ఒకటే అభిప్రాయాలు. అలాగే పెళ్లి విషయంలో కూడా ఇద్దరం ప్రైవేట్‌గా, సింపుల్‌గా చేసుకోవాలనుకున్నాం. ఆ మధుర క్షణాలు మళ్లీ రావనీ, ప్రతి నిమిషం ఎంజాయ్ చేయా లనుకున్నాం. మిగతా ఏ ఫంక్షన్ అయినా అందరితో పాలుపంచుకుని, పబ్లిక్‌గా చేసుకోవచ్చుకానీ, ఇది మాత్రం కాదనిపించింది మా ఇద్దరికీ! అందులోనూ వీళ్లకి ఇక్కడున్న ఫాలోయింగ్‌ని, సర్కిల్‌ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే... హైదరాబాద్‌లో, తిరుపతిలో సింపుల్‌గా చేసుకోవడం అసాధ్యమనిపించి, ముంబైలో మారియట్ హోటల్‌లో రెండు కుటుంబాల సమక్షంలో సింపుల్‌గా చేసుకున్నాం. (నవ్వుతూ) ఈరోజు చేసుకోవాలనుకున్నా ఇద్దరం అలా చేసుకోవడాన్నే ఇష్టపడతాం!

ఇందిర: తనకి మీలో ఏం నచ్చి ఉంటుందంటారు?
నమ్రత: తను నాతో ఎప్పుడూ అనే అవకాశం రాలేదు కానీ, ఇంటర్వ్యూల్లో చెప్పింది చదివాను... నాకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఏదైనా నిక్కచ్చిగా మొహంమీదే చెప్పేస్తాను. ప్రాబబ్లీ అదే తనకు నాలో నచ్చుండొచ్చు. ముఖ్యంగా ఈ ఫీల్డ్‌లో ‘ఏది నువ్వు చేసినా కరెక్ట్’ అని చెప్పే మనుషుల మధ్య నేనలా చెప్పడం బహుశా తనకి నచ్చిందేమో! 

ఇందిర: స్వతంత్ర భావాలున్న మహిళల కుటుంబంలో స్వతంత్రంగా పెరిగిన మిమ్మల్ని పెళ్లికి ముందరే మహేష్ ‘నువ్వు ఇంక వర్క్ చేయకూడదు’ అని పెట్టిన కండిషన్ మీకు ఓకే అనిపించిందా? లేక ఎడ్జస్ట్ అయ్యారా?
నమ్రత: ఎడ్జస్టా? నో వే! పెళ్లికి ముందరే ఇద్దరం మామా అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను క్లియర్‌గా తెలియ జేసుకున్నాం. తనకి నేను కూడా తనలా కష్టపడి పనిచేయడం ఇష్టం లేదు. అందుకే క్లియర్‌గా చెప్పారు వద్దని! అంతేకాదు, నేను కూడా చాలా క్లియర్‌గా ఉన్నాను..‘నాకు తను కావాలి, ఇద్దరం కలిసి బతకాలనుకుంటున్నాం’ అని! సో, దానికోసం తనకు నచ్చింది చేయడం అవసరం అనిపించింది. అంతేకాదు, అప్పటికే నేను చాలా ఏళ్లు కష్టపడ్డాను, ఎంజాయ్ చేశాను, ఇక చాలు అనుకున్నాను. అయినా, ఒకరిని అంతగా ప్రేమించినప్పుడు, మన ప్రపంచమే తను అనుకున్నప్పుడు మన గురించి... ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నామన్న ఆలోచన అసలు రాదు.

ఇందిర: మిస్ నమ్రత ఐడెండిటీని పూర్తిగా వదులుకుని, కేవలం మిసెస్ మహేష్‌గా కొనసాగడం, ఒక్కసారైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా?
నమ్రత: ఇష్టపూర్వకంగా తెలిసిరావడం ఒకెత్తయితే, ఈరోజు మహేష్ కెరీర్‌లో ఇంత సక్సెస్‌గా దూసుకుపోతూ పర్సనల్‌గా ఇంత ఇమేజ్ సంపాదించుకున్న తరుణంలో... వాటన్నిటిలో భాగమైనందుకు ఎంత గర్వంగా ఉందో చెప్పలేను. అయినా, నేనేమీ అన్నీ వదులుకుని పూర్తిగా ఇంట్లో కూర్చోలేదే! ఇప్పటికీ చాలా విషయాల్లో స్వతంత్రంగా ఉన్నాను. ఇల్లు, పిల్లలు, మహేష్, తన వర్క్‌లో కొంత భాగాన్ని సింగిల్ హ్యాండెడ్‌గా బాగానే మేనేజ్ చేస్తున్నాను. వీటికే నాకు టైమ్ సరిపోవట్లేదు... ఇంతకన్నా ఏం చేయగలను.

ఇందిర: మీరొచ్చాక మహేష్ కెరీర్ దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తోంది... లక్కీ ఫ్యాక్టర్ ఇన్ హిజ్ లైఫ్..!
నమ్రత: ఈరోజున మహేష్ ఈ పొజిషన్‌లో ఉన్నారంటే 80% తన హార్డ్‌వర్క్, పాషన్, డెడికేషన్ వల్ల! కొంత లక్ ఉండి ఉండొచ్చు కాదనను. (నవ్వుతూ) ఆ ఫ్యాక్టర్ నేనో కాదో తనని అడగాలి, నన్ను కాదు. నా సమాధానం అయితే... తను అంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్న టైమ్‌లో నేను తన జీవితంలో ఉండడం నా అదృష్టం!

ఇందిర: కనీసం ‘మహేష్’ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడంలోనైనా మీ భాగం లేదంటారా?
నమ్రత: మీరన్నట్టు ఇవాళ మహేష్ ఒక్క యాక్టర్ కాదు.. ఒక బ్రాండ్! దానిలో కొంత నా పాత్ర ఉండి ఉండొచ్చు, కాదనను. తన బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నేను బాగానే కృషి చేశాను. యాక్టింగ్‌లో పూర్తిగా బిజీగా ఉన్న తనకి నేను చేసే సాయం ఎండార్స్‌మెంట్స్, డేట్స్ చూసుకోవడం. ఎండార్స్ మెంట్స్ విషయంలో... ఏమేమి ఆఫర్స్ వస్తున్నాయి, క్రియేటివ్స్ ఏంటి, అప్రోచ్ ఏంటి... ఇవన్నీ మహేష్ ముందు పెట్డం నా డ్యూటీ. ఫైనల్లీ ఏవి చేస్తారు, ఎలా చేస్తారు అన్నది పూర్తిగా తన ఇష్టం. వాటిలో నేనసలు ఇన్వాల్వ్ కాను. ఒకసారి తను ఫలానా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాక డేట్స్ ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలా ఇవ్వాలి, అన్నీ తనకి చెప్పి, తగ్గట్టు చేస్తాను. అయితే ప్రతి విషయంలోనూ తుది నిర్ణయం తనదే!

ఇందిర: మీ వల్ల తనలో వచ్చిన మార్పు...
నమ్రత: ఒకప్పుడు మహేష్ బాగా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. తక్కువ మాట్లాడేవారు. కొత్తవాళ్లతో అసలు మాట్లాడేవారు కాదు. కానీ, ఇప్పుడు బాగా ఓపెన్ అవుతున్నారు. కొత్తవాళ్లతో కూడా కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నారు. అందరికీ మరికొంచెం అందుబాటులో ఉంటున్నారు.

ఇందిర: సక్సెస్ మహేష్‌లో ఏమైనా మార్పు తెచ్చిందా?
నమ్రత: ఏమీ లేదు. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే గ్రౌండెడ్‌గా ఉన్నారు. తన బ్రాండ్ ఇమేజ్ వర్క్ వరకే పరిమితం. ఇంట్లో మా అందరికీ తను మామూలు మహేషే! హి ఈజ్ స్టిల్ ఎ సింపుల్ బాయ్ ఎట్ హార్ట్ యాజ్ ఎవర్!

ఇందిర: ఈ ఫీల్డ్‌లో టెంప్టేషన్స్ రెసిస్ట్ చేసుకోవడమే కష్టం. దానికితోడు మహేష్ అంటే చాలామందికి విపరీతమైన క్రేజ్. ఇక్కడ నావి రెండు ప్రశ్నలు.. ఒకటి - దీనివల్ల మీకెప్పుడూ ఇన్‌సెక్యూరిటీ కలగలేదా? రెండు - ఇప్పటిదాకా తన మీద ఏరకమైన రూమర్స్ రాకపోవడానికి కారణం...
నమ్రత: నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ... పెళ్లయిన ఈ 8 ఏళ్లలో క్షణపాటు కూడా నాకలాంటి ఆలోచన కానీ, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్‌కానీ రాలేదు. దానికి కారణాలు చాలానే ఉండొచ్చు... నాకు తనేంటో బాగా తెలియడం అవచ్చు, లేక పెళ్లికి ముందే మేం దాటేసిన అసూయ అనే అడ్డుగోడ అవ్వచ్చు, ఇద్దరం స్నేహితులుగా ప్రతి విషయాన్ని డిస్కస్ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల కావచ్చు... మహేష్‌లో స్వతహాగా ఉండే నిబద్ధత కావచ్చు... ఏదేమైనా నేను చాలా లక్కీ అని, నాకిలాంటి భర్త దొరికినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పలేను!

ఇందిర: మహేష్‌లాంటి వ్యక్తిని భర్తగా పొందినందుకు టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీల్ అవుతారా? 
నమ్రత: గర్వంగా ఉంటుంది కానీ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. చాలామంది మహేష్ అంటే ఎంతో ఇష్టపడతారు అన్న విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దానిలో డౌట్ లేదు. కానీ మీరిక్కడ ఒక విషయం గమనించాలి. ప్రజలు మహేష్‌ని సినిమాల్లో చేసే పాత్రలకి ఎక్స్‌టెన్షన్‌గా చూస్తారు. కానీ నేను, పిల్లలు తనని అలా చూడం. నార్మల్‌గా ఉంటుంది మాకు. అది మాటల్లో చెప్పడం కష్టం. ఆల్ ఐ కెన్ సే ఈజ్ ఐ ఫీల్ ప్రౌడ్ బియింగ్ హీజ్ వైఫ్!

ఇందిర: ఖలేజాకు ముందు ఓ మూడు సంవత్సరాలపాటు మహేష్ ఏ సినిమా ఒప్పుకోకుండా ఇంట్లోనే ఉన్నారు కదా... ఆ రోజుల గురించి...
నమ్రత: ఆ టైంలో గౌతమ్ చిన్నపిల్లాడు... 4-5 నెలల బేబీ! మా లైఫ్‌లో బ్యూటిఫుల్ టైం అది! ఇద్దరం బాగా టైం స్పెండ్ చేసేవాళ్లం గౌతమ్‌తో. ఫాదర్‌హుడ్‌ని మహేష్ అత్యంత ఆస్వాదించిన టైం అది. షూటింగ్స్ ఉంటే అంత కుదిరేది కాదు కదా! అందులోనూ తను పూర్తి హోమ్ బర్డ్. బయటకు ఎక్కడికీ వెళ్లేవారు కాదు. సో, మహేష్ మొత్తం మాకే అన్నట్టు ఉండేది ఆ టైంలో. బాగా ట్రావెల్ చేసేవాళ్లం. వెకేషన్స్‌కి వెళ్లేవాళ్లం. ఇద్దరివీ ఒకే టేస్ట్ అవడంతో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్లం కూడా. అందులోనూ మాకు పెళ్లయి అప్పటికి రెండేళ్లే! సో, వియ్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ దెన్!

ఇందిర: అదే టైంలో మీ పేరెంట్స్ పోయినట్టున్నారు...
నమ్రత: అవును, ఆ టైమ్‌లోనే అమ్మా, నాన్న ఇద్దరూ సంవత్సరం గ్యాప్‌లోనే పోయారు. నాకది చాలా షాకింగ్‌గా ఉండింది. నిజంగా ఆ టైమ్‌లో మహేష్ నా పక్కన లేకపోయుంటే అదంతా నేను ఎలా తీసుకునేదాన్నో తెలీదు. మహేష్ అప్పటికే నా జీవితంలోకి రావడం, తను ఆ 3 సంవత్సరాలు బ్రేక్ తీసుకోవడంతో నేను కొంచెం తొందరగా తేరుకోగలిగాను. నాకు స్పేస్ ఇవ్వాలని, బ్రేక్ ఇవ్వాలని తను గౌతమ్‌ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లడం దగ్గరనుంచి... పెయిన్ నుంచి బయటకు రావడానికి నాతో కూర్చుని మాట్లాడి స్వాంతన కలిగించేదాకా... ఒకటని కాదు.. . నాకు తను ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్‌గా నిలిచారు. అయితే, అది జరిగిన కొన్నాళ్టికే మహేష్‌కి అత్యంత ఇష్టమైన వాళ్ల అమ్మమ్మగారు కూడా పోవడంతో తను కూడా చాలా డౌన్ అయ్యారు. నిజంగా ఆ మూడేళ్లు మా జీవితంలో ఎన్నో మిక్స్‌డ్ ఎమోషన్స్‌ని నింపాయి. అయితే అవన్నీ మమ్మల్ని, మా బంధాన్ని మరింత దృఢపరిచాయి. మహేష్, నేను ఇద్దరం ఇంకా క్లోజ్ అయ్యాం. 

ఇందిర: మీ తల్లిదండ్రులతో మహేష్ రిలేషన్‌షిప్..?
నమ్రత: అప్పట్లో కూడా మహేష్ ఎండార్స్‌మెంట్స్ అవీ బాగా చేస్తుండడంతో ముంబై వెళ్తే మేం అమ్మవాళ్ల దగ్గరే ఉండేవాళ్లం. ఇంగ్లీష్‌లో అంటారు కదా ‘యాపిల్ ఆఫ్ ద ఐ’ అని.... అలా, వాళ్లకి మహేష్! మాటల్లో చెప్పలేనంత ఇష్టపడేవాళ్లు తనను. నాన్నయితే మరీ... మహేష్ కోసం భాష అర్థం కాకపోయినా, సినిమాలు చూసేవారు... ‘పోకిరి’ సినిమా థియేటర్‌కి వెళ్లి మరీ చూసొచ్చి ఎంత మెచ్చుకున్నారో చెప్పలేను. మా పెళ్లయిన తర్వాత నాన్న సంవత్సరంన్నర మాత్రమే ఉన్నారు. అమ్మ ఇంకో సంవత్సరం. వాళ్లు తనతో ఇంకొన్నాళ్లు స్పెండ్ చేసుంటే బాగుండేదనిపిస్తుంది కానీ, కనీసం అదైనా దొరికిందని సంతోషిస్తూంటాను. ఎందుకంటే, వాళ్లు మహేష్‌తో గడిపిన సమయం తక్కువైనా, ఆ గడిపిన టైం చాలా మెమరబుల్!

ఇందిర: మీ అత్తగారివైపు వాళ్లతో రిలేషన్‌షిప్...
నమ్రత: మావయ్యగారి గురించి చెప్పాలంటే... ఆయనకు మించిన సింపుల్, రియల్ పర్సన్ ఇప్పటిదాకా నాకెవరూ ఎదురుపడలేదు! ఆయన ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు కానీ, చాలా లవింగ్ పర్సన్. ఆయనే కాదు మహేష్ వాళ్ల అమ్మగారు, అన్న, అక్కచెల్లెళ్లు... అందరూ చాలా సరదాగా ఉంటారు. నన్ను వాళ్లింట్లో ఇంకో వ్యక్తిగా, ఇంకో కూతురులా చూసుకుంటారు. ఇంతకుమించిన ఇంట్లో అడుగుపెట్టడం ఉండదు అన్న రీతిలో వీళ్లు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఒకవైపు స్పేస్ ఇస్తూ స్వతంత్రంగా ఉండనిస్తారు, మరోవైపు మేం ఉన్నాం అన్నట్టు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటారు. అందులో ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేకపోవడంతో వీళ్లందరే నాకు ఫ్యామిలీ!

ఇందిర: మహేష్ - మీ సిస్టర్ శిల్ప రిలేషన్‌షిప్ గురించి...
నమ్రత: ఓ గాడ్! పూర్తి ఫన్‌ఫిల్డ్ రిలేషన్‌షిప్ అది! గాడ్.. ఇద్దరు ఒకరినొకరు బాగా ఏడిపించుకుంటారు. మహేష్‌దే పైచేయి అనుకోండి... బాగా ఏడిపిస్తారు శిల్పని! ఇవన్నీ పక్కనపెడితే... శిల్పకు మహేష్ అంటే ప్రాణం! మహేష్‌కి కూడా శిల్ప అన్నా, తన భర్త అప్రేష్ అన్నా చాలా ఇష్టం. వాళ్లు కూడా ఇండియా వచ్చేశాక హైదరాబాద్‌కు రెగ్యులర్‌గానే వస్తూపోతూ ఉంటారు. వాళ్లకు ఒక కూతురు... అనిష్క... పదేళ్లు. గౌతమ్, అనిష్క కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు.

ఇందిర: మీరు కూడా ముంబైకి రెగ్యులర్‌గానే వెళ్తుంటారా!
నమ్రత: అమ్మవాళ్లు పోయాక తగ్గిపోయింది. శిల్ప ఇక్కడికి వస్తుంటుంది కాబట్టి అక్కడ మిగిలింది కొందరు ఫ్రెండ్సే! కానీ వాళ్లను కలవడానికి మాత్రమే వెళ్లడం కుదరదు. ఎప్పుడైనా మహేష్‌కి అక్కడ వర్క్ ఉంటే వెళ్తాం, లేదా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాం. అదీ... తను ఫ్రీగా ఉంటేనే! 

ఇందిర: ఇప్పుడు అందరూ అక్కడికి వర్క్ కల్పించుకుని మరీ వెళ్తున్నారుగా... బాలీవుడ్ అంటూ! అందులోనూ మీకు అక్కడ బేస్ ఉంది... మహేష్ ఎందుకు బాలీవుడ్ వైపు చూడట్లేదు?
నమ్రత: (నవ్వేసి) దానికి నా దగ్గర అస్సలు సమాధానం లేదు... ఆ ప్రశ్న మీరు మహేష్‌నే అడగాలి!

ఇందిర: పిల్లలు పుట్టాక మీ లైఫ్ ఎలా ఛేంజ్ అయింది?
నమ్రత: లైఫ్ ఫుల్ సర్కిల్ తిరిగినట్టు అనిపిస్తుంది. ‘అమ్మ’ అన్న ఎమోషన్‌కి మించింది ఈ లోకంలో లేదని తెలుసు కున్నాను. పిల్లలు ఉన్నవాళ్లకే అర్థం అవుతుంది నేనేం చెప్తున్నానో! అది పక్కనపెడితే... మనం పేరెంట్స్ అయితే తప్ప మన పేరెంట్స్ విలువ మనకు తెలీదు. బాగా గుర్తు... చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ అనేది - ‘పిల్లలు పుట్టినప్పుడు నీకూ తెలిసివస్తుంది’ అని! ‘యా రైట్’ అని నాకు నచ్చింది చేసేదాన్ని. ఓ గాడ్! ఇప్పుడు ఆ మాటలు ఎన్నిసార్లు గుర్తొస్తాయో చెప్పలేను! ఇక మహేష్ విషయానికి వస్తే... తను మనిషిగా చాలా ఛేంజ్ అయ్యారు. ప్రతి భార్య తన భర్త గురించి ఇదే చెప్తుందేమో తెలీదు కానీ, నాకు మాత్రం మహేష్ పిల్లలతో ఆడే తీరు చూస్తే ముచ్చటగా ఉంటుంది.

ఇందిర: పిల్లాడికి డైపర్‌లు మార్చడం లాంటి హెల్ప్ ఎప్పుడైనా.?
నమ్రత: (నవ్వుతూ) డైపర్లు మార్చడం తనవల్ల అయ్యే పని కాదు! కానీ చాలా విషయాల్లో హెల్ప్ చేసేవారు. పిల్లాడికి స్నానం చేయించడం నుంచి కొడుకును తీసుకుని బయటకు వెళ్లి నాకు బ్రేక్ ఇచ్చే కొన్ని పనులు చేసేవారు. ఒక మాటలో చెప్పాలంటే ‘బాయ్’ థింగ్స్ అనుకునేవన్నీ చేసేవారు..

ఇందిర: ఇప్పుడు సితారతో......
నమ్రత: ఇప్పుడు తను చాలా బిజీ అయిపోయారు. గౌతమ్ టైంలో పూర్తిగా ఇంట్లో ఉండడంతో, తనతో స్పెండ్ చేసినట్టు ఇప్పుడు సితారతో చేయలేకపోతున్నారు. ఇప్పుడు సితారది చూసి గుర్తుపట్టి, నవ్వే వయసు. తనని వదిలి వర్క్‌కి వెళ్లడం మహేష్‌కి అస్సలు ఇష్టం ఉండదు. పాపం ఒక్కోసారి గిల్టీగా కూడా ఫీలవుతారు. అయితే వీలున్నంతవరకు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. మహేష్ ఉన్నంతలో ఇంటిని, వర్క్‌ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. వర్క్ లేకపోతే మాతోనే ఉంటారు. తనున్న ప్రొఫెషన్‌లో, తనున్న పొజిషన్‌లో అది చాలా గొప్ప విషయం!

ఇందిర: పిల్లల పెంపకంలో మీరు బ్యాడ్ కాప్ అని, మహేష్ గుడ్ కాప్ అని ఎక్కడో చెప్పగా విన్నాను...
నమ్రత: అవును... తను పిల్లలకి ఎప్పుడూ దేనికీ నో చెప్పరు. వాళ్లతో గడిపే టైమే తక్కువ అవడంతో ఉన్న కాసేపు సరదాగా, హాయిగా ఉండాలనే చూస్తారు. తనుంటే వాళ్ళు ఏదంటే అదే చెల్లుతుంది. అలా పాడు చేయడం కరెక్ట్ కాదని నేనే ఒక్కోసారి గట్టిగా చెప్తాను. (నవ్వుతూ) సో, నేచురల్లీ నేనే అక్కడ చెడ్డదాన్ని అవుతాను. అయితే, ఇద్దరం అలా ఉన్నా కరెక్ట్ కాదు, ఇలా వున్నా కరెక్ట్ కాదు. మహేష్‌ని బ్యాలెన్స్ చేయడానికి నేను అలా ఉండక తప్పదు!

ఇందిర: (నవ్వుతూ) మొన్నేదో ఓ పబ్లిక్ ఈవెంట్‌లో... మహేష్ ఇంకో బేబీ కావాలని అడిగితే మీరు కాదన్నారని...?
నమ్రత: (నవ్వుతూ) ఓ గాడ్! ఇద్దరం చాలా జోక్‌గా అనుకున్న దానిని మీడియా చిలవలుపలవలుగా చేసింది.. ఎనీవే, ఇంటికొచ్చి నవ్వుకున్నాం. అంతకుమించి ఏం చేస్తాం?

ఇందిర: గౌతమ్ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడట... ట్రయల్ షూట్ కూడా జరిగిందని విన్నాం...
నమ్రత: ట్రయల్ షూట్ అనడానికి లేదు. మేకప్ కూడా వేయలేదు... జస్ట్ కూర్చోబెట్టి మాట్లాడారు అంతే! నటిస్తావా అని అడగ్గానే ఒప్పుకున్నాడు కానీ, తనింకా ష్యూర్ కాదనుకుంటా! మేం తనని బలవంతం చేయదలచుకోలేదు. ఇష్టం ఉంటే చేస్తాడు ... లేకపోతే లేదు.

ఇందిర: మీకూ, మహేష్‌కి జీవితంలో ప్రత్యేకమైన గోల్స్ ఏమైనా ఉన్నాయా?
నమ్రత: సినిమాకు సంబంధించినంతవరకూ మహేష్‌కి ప్రజలకు నచ్చే మంచి సినిమాలు చేస్తూపోవాలనేదే గోల్. ఒక్కటైతే చెప్పగలను... కమర్షియల్ సినిమా, డబ్బు వస్తోంది కదా అని మాత్రం తను ఏ సినిమా ఒప్పుకోరు. ఏ పని అయినా నచ్చనిదే చేయరు. పర్సనల్ గోల్స్ అంటే... మీరు తననే అడగాలేమో! ఇక నా గురించి చెప్పాలంటే... మహేష్, పిల్లలు - వాళ్లే నా ప్రపంచం. వాళ్లని మించి నాకు జీవితంలో ఇంకో పర్పస్ లేదు. అయితే నాకు, మహేష్‌కి కామన్‌గా ఎప్పటినుంచో ఒకటి మాత్రం చేయాలని ఉంది... ఎప్పటికైనా రెయిన్‌బో హాస్పిటల్‌తో టైఅప్ అయ్యి, పిల్లలకి సంబంధించి ఏదైనా చేయాలని ఉంది.

ఇందిర: బొడ్డుతాడు దాచుకోవడం (స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్) గురించి అవేర్‌నెస్ తీసుకొచ్చే ఉద్దేశం కూడా ఉన్నట్టుంది...
నమ్రత: అవును. మా పిల్లలిద్దరికీ చేశాం. ఆ అవేర్‌నెస్ ఇంకా ఇక్కడ రాకపోవడంతో ఎక్కువమంది చేయడంలేదు. పిల్లలు పుట్టినప్పుడు దాన్ని దాచడం వల్ల పెద్దయ్యాక వాళ్లకది బాగా ఉపయోగపడొచ్చని, అది ఎన్నోరకాల చికిత్సలకోసం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని చాలామందికి తెలీదు. అది అందరికీ తెలియజెప్పడం మంచి కాజ్ అని నమ్ముతున్నాను. ఫ్యూచర్‌లో నా కెపాసిటీలో ఆ కాజ్‌ని ఎంత వరకు డ్రైవ్ చేయగలిగితే అంత చేస్తాను!

source:sakshi
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger