Home » , , , , , » 15 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

15 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

విప్ ధిక్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న 15 మంది శాసనసభ్యులపై శాసనసభా స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడినవారిలో 9 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ఆరుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ విషయం వెల్లడించారు.
సుజయ రంగారావు (బొబ్బిలి), ఆళ్ల నాని (ఏలూరు), పి.. సాయిరాజ్ (ఇచ్చాపురం), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), జోగి రమేష్ (పెడన), ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి (కాకినాడ అర్బన్), ఎ రాజేష్ (చింతలపూడి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), పేర్ని నాని (మచిలీపట్నం), శివప్రసాద్ రెడ్డి (దర్శి)లపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలా చారి, చిన్నం రామకోటయ్యలను వేటు నుంచి మినహాయించారు.
విప్‌ను ధిక్కరించారంటూ మొత్తం 18 మంది శానససభ్యులపై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. తమ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుజయ కృష్ణరంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నానీ విప్‌ను ధిక్కరించారని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరంతా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ప్రభుత్వంపై శాసనసభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా విప్‌ను ధిక్కరించి ఓటేశారు.
విప్‌ను ధక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై తెలుగుదేశం శానససభా పక్షం (టిడిఎల్పీ) ఫిర్యాదు చేసింది. అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉండాలంటూ టిడిఎల్పీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే, వారంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు. విప్ ఉల్లంఘించారంటూ టిడిఎల్పీ స్పీకర్‌కు సమర్పించిన జాబితాలో తెలుగుదేశం శాసనసభ్యులు సాయిరాజ్(ఇచ్ఛాపురం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), వేణు గోపాలాచారి (ముధోల్) ఉన్నారు. వీరిలో హరీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు.
వేణుగోపాలాచారి ప్రస్తుతం ఇతర పార్టీలకు వెళ్లలేదు. వేణుగోపాలాచారి నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ నగారా సమితిలో ఉన్నారు. అయితే, నగారా సమితిని నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో విలీనం చేశారు. మిగతా ఏడుగురు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు.

source:thatstelugu
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger