Home » , , » మహేందర్‌ కొత్త ఆరోపణ....

మహేందర్‌ కొత్త ఆరోపణ....

హరీష్‌ 80 లక్షలు ముడుపులు తీసుకున్నారు
ఆధారాలు బయటపెట్టిన రఘునందన్‌రావు
సీబీఐ, హైకోర్టుకు ఆధారాలు ఇస్తా.. 
బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వరికీ భయపడను
టీ న్యూస్‌, టీఆర్‌ఎస్‌పై పరువు నష్టం దావా 
వేస్తానన్న రఘునందన్‌


తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్‌ అయిన నేత రఘునందనరావు చేసిన తీవ్రమైన ఆరోపణలపై పార్టీ నాయకత్వం ఇప్పుడిప్పుడే స్పందించటం ప్రారంభించింది. అయితే ఈ స్పందన వచ్చిన తీరు చూస్తే కరాఖండిగా కొట్టి పారేయటం మాదిరి గా కాకుండా ఆత్మ రక్షణ ధోరణిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ మేనల్లుడు, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు టార్గెట్‌గా రఘునందన్‌ గత రెండు రోజుల నుంచీ చేస్తున్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం విడివిడిగా స్పందించారు. 

అయితే ఈ స్పందనలన్నీ అసలు విషయాన్ని వదిలేసి మిగిలిన విషయాలపై సాగుతున్నాయని, రఘునందన్‌ చేసిన పద్మాలయా స్టూడియోస్‌ కేసు వ్యవహారం, హరీశ్‌కు రూ.80 లక్షల సూట్‌కేసు అందిందన్న ఆరోపణ, అది కూడా మెదక్‌ ఎంపీ విజయశాంతి నివాసంలో డీల్‌ కుదిరిందన్న ఆరోపణ, అశోకా హోటల్‌లో కూడా హరీశ్‌కు డబ్బులు అందాయంటూ చేసిన మరో ఆరోపణపై ఇటు ఈటెల రాజేందర్‌ కానీ, అటు కవిత కానీ సూటిగా జవాబు ఇవ్వకుండా దాటవేత ధోరణి అనుసరించారన్న అభిప్రాయం పార్టీ వర్గాలలోనే వ్యక్తమవుతోంది. ఎంతసేపూ రఘునందన్‌కు దమ్ము ఉంటే ఆ సీడీలు ఏవో, ఆధారాలు ఏవో బయటపెట్టాలని పైపై మాటలు మాట్లాడటమే తప్ప అసలు హరీశ్‌పై వచ్చిన ఆరోపణ పచ్చి అవాస్తవం అని కానీ, ఆయన స్వచ్ఛమైన నేత అని కానీ ఈటెల, కవిత నోటి వెంట రాకపోవటం గమనార్హం. 

అలాగే తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేసేందుకు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీశ్‌ సైతం ఎంత సేపూ తెలంగాణ వాదాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగం అనీ, రఘునందన్‌కు పదవులు ఇచ్చినా అందిపుచ్చుకోలేకపోయారని....ఇలా మాట్లాడుతూ వెళ్ళారే తప్ప అవినీతి వ్యవహారం గురించి కానీ, టీఆర్‌ఎస్‌ నాయకత్వం టికెట్లు అమ్ముకుంటున్నదని రఘునందన్‌ చేసిన మరో ఆరోపణపైన కానీ కచ్చితమైన జవాబులివ్వలేకపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. 

కుట్ర కోణంతో కొట్టేసే యత్నం....
రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టి హరీశ్‌కు అండగా నిలిచేందుకు ఈటెల రాజేందర్‌, మరి కొందరు నేతలు శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసలు ఆరోపణను అంత పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. హరీశ్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామంటూ మీడియా సమావేశం ప్రారంభించిన ఈటెల ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమం గురించీ, జరిగిన నమ్మక ద్రోహాల గురించీ, వెళ్ళిపోయిన వారి గురించీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించీ, అప్పట్లో ఆయన అమలు చేసిన ఆపరేషన్‌ ఆకర్ష గురించీ, 

తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శాసనసభలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వబోనని అనటం గురించీ, కడియం శ్రీహరి లాంటి వారు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే చంద్రబాబు దుగ్ధ గురించీ చెప్పి పనిలో పనిగా వైకాపా అధ్యక్షుడు జగన్‌ పేరు కూడా ప్రస్తావించారు. రఘునందన్‌ లాంటి వారితో వీరే...అందులోనూ ప్రధానంగా ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. రఘునందన్‌ ఇలాంటి వారిలో మొదటి వారూ కాదు...చివరి వారూ కాదు...అని ముక్తాయింపు ఇచ్చారు...ఈటెల ప్రసంగం అంతా ఇలా టీఆర్‌ఎస్‌పై కుట్ర కోణంలో సాగిపోయిందే తప్ప రఘునందన్‌ నిర్దిష్టంగా చేసిన ఆరోపణకు జవాబు మాత్రం వినిపించలేదు. పద్మాలయా స్టూడియోస్‌ వ్యవహా రంలో హరీశ్‌కు రూ.80 లక్షలు అందాయని వచ్చిన ఆరోపణ సామాన్యమైనది కాదు...ఎందుకంటే హరీశ్‌ సాధారణ ఎమ్మెల్యే కాదు....శాసనసభా పక్ష ఉప నేత గానే కాకుండా, పార్టీ అధినేతకు స్వయానా మేనల్లుడు... అలాంటి నేతపై ఆరోపించిన వారు దారిన పోయే దానయ్య కాదు....

నిన్న మొన్నటిదాక టీఆర్‌ఎస్‌లో కీలకపాత్ర పోషించి విధాన నిర్ణయాలలో చురుకుగా పాల్గొన్న నేత...ఇది ఇలా ఉంటే, తన నివాసంలో పద్మాలయా స్టూడియోస్‌కు సంబంధించిన సెటిల్‌మెంట్‌ జరిగిందని రఘునందన్‌ ఆరోపిస్తే విజయశాంతి సైతం మౌనం వహిం చటం మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోసినట్టయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు శనివారం వరంగల్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత సైతం హరీశ్‌ను సమర్థించటంలో కుట్ర కోణాన్నే ఆవిష్కరించారు తప్ప డబ్బుకు సంబంధించిన ఆరోపణలపై స్పందించలేకపోయారు.

మహేందర్‌ కొత్త ఆరోపణ....
ఇదిలా ఉంటే...కొద్ది సంవత్సరాల క్రితం దాకా టీఆర్‌ఎస్‌లో ఉండి, ఆ తర్వాత బయటకు వెళ్ళి ప్రస్తుతం వైకాపాలో ప్రముఖ నాయకుడుగా ఉన్న కేకే మహేందర్‌ రెడ్డి తాజాగా సరికొత్త ఆరోపణ చేశారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండి కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ను ఢీ కొన్న మహేందర్‌ రెడ్డి శనివారం ఒక ఎలక్ట్రానిక్‌ మీడియా చానల్‌ నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఏకంగా కేసీఆర్‌పైనే తీవ్ర ఆరోపణ చేశారు. 2009 ఎన్నికల్లో తనను ఓడించేందుకు హరీశ్‌ స్వయంగా రూ.50 లక్షల రూపాయలను కేకే మహేందర్‌కు ఇచ్చారంటూ కేటీఆర్‌ తనతో అన్నారని రఘునందన్‌ చేసిన ఆరోపణ చర్చాగోష్ఠి సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. 

ఆ గోష్ఠిలో మహేందర్‌తో పాటు రఘునందన్‌, అప్పట్లో టీఆర్‌ఎస్‌లో చురుకుగా ఉన్న వి.ప్రకాశ్‌ కూడా ఉన్నారు. ఈ రూ.50 లక్షల సంగతిని ప్రస్తావించినప్పుడు మహేందర్‌ మాట్లాడుతూ మరో కొత్త వివాదాన్ని ముందుకు తీసుకు వచ్చారు.2004 ఎన్నికల సందర్భంగా కేటీఆర్‌పై పోటీ చేయకుండా ఉండేందుకు కేసీఆర్‌ స్వయంగా తనకు రూ.10 కోట్లు ఇచ్చి సికిందరాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇస్తామన్నారని కథ బయట పెట్టారు. తనను గుర్తు తెలియని ఇంటికి పిలిపించారని, అక్కడికి కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా వచ్చారని చెప్పారు. దీన్ని అక్కడే ఉన్న ప్రకాశ్‌ ఖండించకపోగా కేసీఆర్‌ చేసిన దాంట్లో తప్పేముందని సమర్థించేందుకు ప్రయత్నించటం మళ్ళీ పార్టీ వర్గాలలో చర్చనీయాంశమైనట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణ సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టిందని, అధినేతపైనే ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని తిప్పి కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీనియర్‌ నేతలు కొందరు అంగీకరించారు.


Courtesy:suryaa news

Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger