కేంద్ర ప్రభుత్వం ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించడంలో, సంస్కరణలను వేగంగా అమలు చేయడంలో విఫలమైతే భారత్ సావరిన్ రేటింగ్‌ను జంక్ గ్రేడ్ స్థాయికి తగ్గించాల్సి వస్తుందని గ్లోబల్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పి) శుక్రవారం హెచ్చరించింది. ప్రస్తుతమున్న భారత్ సావరిన్ రేటింగ్ ‘బిబిబి’ని ప్రతికూల దృక్పథంతో కొనసాగిస్తూనే, రానున్న 12 నెలల కాలంలో ఈ రేటింగ్‌ను తగ్గించడానికి మూడింట ఒక వంతు అవకాశముందని తేల్చిచెప్పింది. అయితే ఎస్ అండ్ పి హెచ్చరికలపై ప్రభుత్వం భయపడాల్సిన అవసరమేమీ లేదని పేర్కొంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అర్వింద్ మాయారామ్ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రస్తుతం సరైన దారిలోనే ప్రయాణిస్తున్నామని, ఎస్ అండ్ పి తాజా హెచ్చరికలతో భయపడాల్సిన అవసరం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య ఆర్థిక సలహాదారు రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ఇటీవలికాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారత్ అనేక రకాల సంస్కరణలు చేపట్టిందని, అవి భారత్ రేటింగ్‌ను పెంచడానికి సరిపోవని ఎస్ అండ్ పి భావించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కాగా, ఈ దశాబ్దం తొలినాళ్లలో సాధించిన స్థాయికి ఆర్థిక వృద్ధిని తీసికెళ్లడానికి అవసరమైనంత వేగంగా సంస్కరణలను అమలు చేయకుంటే భారత్ రేటింగ్‌ను తగ్గించే అవకాశముందని ఎస్ అండ్ పి ఒక ప్రకటనలో తెలిపింది. ‘బిబిబి’ అనేది దిగువ స్థాయి ఇనె్వస్ట్‌మెంట్ గ్రేడ్. దీని కన్నా తక్కువ గ్రేడ్ అంటే దేశ సావరిన్ రేటింగ్‌ను జంక్ గ్రేడ్ స్థాయికి తగ్గించడమే. దేశం గ్రేడ్ ఈ స్థాయికి దిగజారితే కార్పొరేట్ సంస్థలు విదేశాల నుంచి తెచ్చుకునే రుణాలపై వడ్డీ మరింత పెరుగుతుంది. అధిక ద్రవ్య లోటు, ప్రభుత్వంపై ఉన్న అధిక రుణభారం ప్రధానంగా మన సావరిన్ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అయినప్పటికీ పబ్లిక్ ఫైనాన్స్‌లను ప్రభుత్వం తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకుంది. 2012 సెప్టెంబర్ నుంచి తాజా వ్యవస్థీకృత సంస్కరణల అమలుకు పూనుకుంది’ అని ఎస్ అండ్ పి క్రెడిట్ అనలిస్ట్ టకహిర ఒగావా చెప్పారు. భారత్‌లో మందకొడి వృద్ధి రేటు చక్రీయమైనప్పటికీ లేబర్, ఉత్పత్తి మార్కెట్లలో నెలకొన్న జడత్వం, తగినంతగా లేని వౌలిక సౌకర్యాలు దేశ మధ్యకాలిక వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి. వౌలిక సదుపాయాలు, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులలో ఉన్న కఠినమైన ఆంక్షలను తొలగించి పెట్టుబడులను ఆకర్షించడానికి కాబినెట్ కమిటీ చర్యలు తీసుకున్నప్పటికీ, తగినన్ని పెట్టుబడులను సమీకరిస్తుందా అనే విషయం ఇంకా అనిశ్చితిలోనే ఉందని ఎస్ అండ్ పి పేర్కొంది. ద్రవ్య లోటును అదుపులో ఉంచడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున రేటింగ్‌ను పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు గత నెలలో ఎస్ అండ్ పి ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వాదించారు. భారత్‌లో దీర్ఘకాలిక వృద్ధి రేటుకు అవకాశాలు మెరుగుగా ఉండటంతో పాటు దేశంలో అధికంగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు మంచి రేటింగ్‌కు సానుకూల అంశాలుగా ఉన్నాయి. అయితే భారీగా ఉన్న ద్రవ్యలోటు, ప్రభుత్వంపై ఉన్న అధిక రుణభారం ఈ విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment