విదేశీ లగ్జరీ కార్ల కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి భారత్‌లోనే లగ్జరీ కార్లను అసెంబుల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటే వంద శాతం వరకూ సుంకం చెల్లించాల్సి రావడంతో లోకల్‌గానే ఈ కార్లను తయారు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ దిశగా అడుగులు వేశాయి కూడా. భారత యువత లగ్జరీ కార్లపై మక్కువ చూపుతుండడం కూడా కంపెనీలకు కలసివస్తోంది. మరిన్ని వివరాలు... జోరుగా లగ్జరీ కార్ల అమ్మకాలు భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు జోరుగా ఉంటున్నాయి. గతేడాది మామూలు కార్ల అమ్మకాలు ఓ మోస్తరుగా ఉండగా, లగ్జరీ కార్ల అమ్మకాలు మాత్రం రెట్టింపు వృద్ధిని సాధించాయి. గత మూడేళ్లలో రూ. 30 లక్షల లోపు ఖరీదున్న లగ్జరీ కార్ల అమ్మకాలు ఐదు రెట్లు పెరిగాయి. బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీల అమ్మకాలు బాగా పెరిగాయి. రూ. 30 లక్షల లోపు వివిధ రకాల మోడళ్లను ఈ కంపెనీలు ఆఫర్ చేస్తుండటంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 25 వేల కార్లు అమ్ముడవుతున్నాయని, 2015 కల్లా ఈ సంఖ్య 50 వేలకు పెరుగుతుందని అంచనా. ధరే కీలకం..: లగ్జరీ కార్ల మార్కెట్‌ను మరింతగా విస్తరించుకోవడానికి, కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి, ధరలే కీలకమని కంపెనీలు భావిస్తున్నాయి. పూర్తిగా తయారైన లగ్జరీ కారును దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ సుంకం 75 నుంచి వంద శాతం వరకూ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రూ. 50 లక్షల విలువున్న లగ్జరీ కారు భారత్‌లో దిగుమతి చేసుకుంటే సుంకాలన్నిం టినీ కలుపుకొని దాని విలువ రూ.88 లక్షల వరకూ ఉంటుంది. దీంతో లగ్జరీ కార్ల విడిభాగాలను దిగుమతి చేసుకుని (విడిభాగాల దిగుమతిపై సుంకాలు తక్కువ) అసెంబుల్ చేస్తున్నాయి. ఫలితంగా రూ. 30 లక్షల లోపు లగ్జరీ కార్లను అవి విక్రయించగలుగుతున్నాయి. వీటి అమ్మకాలు జోరుగా ఉండటంతో ప్రస్తుతం లగ్జరీ కార్లను ఇక్కడే అసెంబుల్ చేస్తున్న కంపెనీలతో పాటు మరికొన్ని కొత్త కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. రూ. 25 లక్షల లోపు లగ్జరీ కార్లను స్థానికంగానే తయారు చేసి వినియోగదారులకు అందించాలని ఆయా కంపెనీలు యోచిస్తున్నాయి. లోకల్ లాభాలు... లోకల్‌గా తయారు చేస్తే రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి కస్టమ్స్ సుంకం భారీగా తగ్గి తక్కువ ధరకు వాటిని అందించవచ్చు. ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయి. మరొకటి స్థానిక పరిస్థితులను బట్టి కార్లలో మార్పులు, చేర్పులు చేసి వినియోగదారుల నుంచి మరింత ఆదరణను పొందవచ్చు. లోకల్‌గా తయారు చేయడం వల్ల మంచి నాణ్యతను, మరింత ఎక్కువగా సౌకర్యాలను అందించగలమని కంపెనీలు అంటున్నాయి. తక్కువ ధరలలో యువ వినియోగదారులను ఆకర్షించడం తమ లక్ష్యమని, దానికి లోకల్ తయారీనే భేషైన మార్గమని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఆడి, బీఎండబ్ల్యూ, జేఎల్‌ఆర్‌ల పోటీ... క్యూ3 ఎస్‌యూవీ అమ్మకాలు బాగా ఉండటంతో ఈ ఏడాది జూన్ నుంచి ఈ కార్లను భారత్‌లోనే అసెంబుల్ చేయాలని ఆడి కంపెనీ యోచిస్తోంది. ఆ తర్వాత ఏ3 కారును కూడా ఇక్కడే అసెంబుల్ చేయనున్నది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం ఐదు కార్లను లోకల్‌గా తయారు చేయాలనేది కంపెనీ లక్ష్యం. ఇక బీఎండబ్ల్యూ కంపెనీ మినీ, రోల్స్‌రాయిస్ ఇతర పేరొందిన బ్రాండ్ల కార్లను భారత్‌లో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు కార్లను భారత్‌లోనే అసెంబుల్‌చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఇలా అసెంబుల్ చేసే కార్ల మోడళ్లను ఆరుకు పెంచాలనుకుంటోంది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ కూడా కొన్ని కార్లను ఇక్కడే అసెంబుల్‌చేయాలని యోచిస్తోంది. రూ.56 లక్షలకు విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ ఎక్స్‌ఎఫ్‌ను భారత్‌లోనే అసెంబుల్ చేయాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ నిర్ణయించింది. ఫలితంగా ఈ కారు ధర రూ.12 లక్షల వరకూ తగ్గుతుంది. ఈ కంపెనీ ఇప్పటికే ల్యాండ్‌రోవర్ ఫ్రీల్యాండర్ 2ను భారత్‌లోనే అసెంబుల్ చేస్తోంది. మొత్తం మీద విడిభాగాలు దిగుమతి చేసుకొని, లోకల్‌గా అసెంబుల్ చేసి తక్కువ ధరకు అందించి, ఎక్కువ అమ్మకాలు సాధించాలని లగ్జరీ కంపెనీలు వ్యూహాలు రచిస్తున్నాయి. |
Home »
technology
» జోరుగా లగ్జరీ కార్ల అమ్మకాలు
జోరుగా లగ్జరీ కార్ల అమ్మకాలు
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment