కమ్ముకొస్తున్న చైనా
సూపర్ పవర్‌గా మారేందుకు తహతహ
నింగి, నేల, నీటిపై ఆధిత్యం దిశగా పావులు..
భారత్ చుట్టూ కీలక స్థావరాల ఏర్పాటు
సరిహద్దు దేశాలన్నింటిలోనూ పాగా..
'ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్'తో సవాల్
అగ్రరాజ్యంగా ఎదగాలన్న ఆశ.. సూపర్ పవర్‌గా నిలవాలన్న కోరిక.. చైనాలో ఆధిపత్య కాంక్షను రగిలిస్తోంది. ప్రపంచ పెద్దన్నగా మారడానికి అగ్రరాజ్యం అమెరికాను అనుసరిస్తోంది. దాని బాటలోనే సాగుతూ నింగి, నేల, నీటిపై క్రమంగా పట్టు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఆసియాలో ప్రధాన ప్రత్యర్థి భారత్ చుట్టూ పద్మవ్యూహం పన్నుతోంది. ఇందుకు చైనా ఎంచుకున్న మార్గమే 'ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్'.
చైనా కమ్ముకొస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో శరవేగంగా విదేశీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ దూసుకొస్తోంది. సూపర్‌పవర్‌గా ఎదగడానికి తహతహలాడుతోంది. దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం భారత్ లక్ష్యంగా ద్వీపకల్పం చుట్టూ పద్మవ్యూహం పన్నుతోంది. ఇందుకు 'ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్' పేరిట వ్యూహం అమలు చేస్తోంది.
భారత సరిహద్దు తీరాల్లో పోర్టులను చేజిక్కించుకుని స్థావరాలను సిద్ధం చేస్తోంది. ఇందుకు పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లను పావులుగా వాడుకుంటోంది. భారత్ చుట్టూ దాదాపు అన్ని దేశాల్లో పాగాకు చైనా ఉవ్విళ్లూరుతోంది. అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, రక్షణ వ్యవస్థలను తరలించేందుకు మార్గాన్ని రెడీ సుగమం చేసుకుంటోంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అలజడి
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా కార్యకలాపాలు పెరుగుతున్నాయి. భారత్ నుంచి ఆక్రమించుకున్న దే కాకుండా పాకిస్థాన్ బహుమానంగా ఇచ్చిన 5వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనూ చైనా స్థావరాలు పెరిగాయి. భారత నిరసనలను ఖాతరుచేయకపోగా సైనిక అవసరాల కోసం రోడ్లను (కారాకోరం హైవే) విస్తరిస్తోంది. ఇక్కడి నీలం నదిపై రెండు భారీ జలవిద్యుత్ కేంద్రాలనూ నిర్మిస్తోంది. మన పొరుగున ఉన్న నేపాల్‌లో భారీగా రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. దీంతో టిబెట్ మీదుగా నేపాల్‌కు నేరుగా రవాణాకు రోడ్లు వేసుకుంటోంది.
ఎప్పుడూ భార త గుప్పిట్లో ఉండే భూటాన్‌ను మెల్లిగా తనవైపు తిప్పుకుంటోంది. ఎన్నడూ లేనిది భూటాన్ ఈ మధ్యే చైనాతో ద్వైపాక్షిక సంబంధం తమ హక్కు అని పేర్కొనడం ఇందుకు నిదర్శనం. శ్రీలంకకు షరతులు లేకుండా నిధులిస్తూ దారికి తెచ్చుకుంటోంది. అక్కడి తీరంలో ఓ కీలక పోర్టు, విమానాశ్రయ నిర్మాణానికి వ్యూహం రచిస్తోంది. ఇక హిందూ మహాసముద్రంలోని చిన్నదీవుల సమూహం సీషెల్స్‌లోనూ తొలి విదేశీస్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది.
అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లోని ద్వీపాలలో కూడా భారత్ లక్ష్యంగా చైనా తిష్ఠ వేస్తోంది. దక్షిణాసియా దేశాలలో పెట్టుబడులకు తమకున్నంత అధికారం భారత్‌కు లేదని వాదిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో సంబంధ బాంధవ్యాల కోసం భారత్ యత్నిస్తున్నా, ఆ దేశాలు చైనా ప్రలోభాలకు లోబడుతున్నాయి. మాందే బ్ (పాకిస్థాన్), హోర్ముజ్(శ్రీలంక), మలక్కా (బంగ్లాదేశ్) కీలక జలసంధులలో సైనిక స్థావరాలను నిర్మించుకుంది. దీన్నే 'ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్'గా పిలుచుకుంటోంది. మరావ్(మాల్దీవులు), గ్వడార్ (పాకిస్థాన్), చిట్టగాంగ్ (బంగ్లాదేశ్), సిత్వే(మయన్మార్), లామూ( కెన్యా), హాంబన్‌టోట (శ్రీలంక) రేవులను చైనా అతి వేగంగా అభివృద్ధి చేస్తోంది.
మయన్మార్ నుంచి చైనాకు బర్మా రోడ్ పేరిట అతి పొడవైన రహదారి నిర్మాణం చేపట్టింది. వంద కోట్ల మందిని పోషించగల ఇంధన, సహజ, ఆహార వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందుకే ఎం తో దూరదృష్టితో మయన్మార్‌ను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంది. దాదాపు రూ.15వేల కోట్లతో మయన్మార్ నుంచి చమురు పైప్‌లైన్‌ను కూడా వేస్తోంది. ఇవన్నీ పూర్తయితే ఈ శతాబ్దంలో ఇక చైనాకు చీకూ చింతా ఉండదు.
అలాగే ఇక్కడ పోర్టును కూడా నిర్మిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, కజకిస్థాన్, థాయ్‌లాండ్, మలేసియాల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టింది. చైనా కంపెనీలన్నీ విదేశీ మార్కెట్లను కైవసం చేసుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్‌కు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఏమాత్రం ఆదమరచినా పొదల్లో పొంచి ఉన్న క్రూరమృగంలా చైనా మనల్ని మింగేయడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన కేంద్రం పాక్
దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం మీదుగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో వివిధ స్థావరాల అభివృద్ధికి ఆయా దేశాలతో చైనా సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. సహాయం పేరిట పేద దేశాలను మచ్చిక చేసుకుంటోంది. పాక్ తీరప్రాంతం గ్వడార్‌లో రూ.8వేల కోట్లతో భారీ ఓడరేవును నిర్మించింది. ఇది భారత్, అమెరికాలకు ఆందోళన కలిగిస్తోంది. భౌగోళికంగా కీలక ప్రాంతమైన గ్వడార్‌లో పోర్ట్ ద్వారా హిందూ మహాసముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంపై పట్టు లభిస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ మీదుగా రవాణాకూ ఇది కీలక కేంద్రంగా మారుతుంది. గ్వడార్‌కు ఓ పక్క ఇరాన్ సరిహద్దులు, మరోపక్క చమురు రవాణాకు కీలకమార్గమైన హోర్ముజ్ జలసంధి కూడా ఉన్నాయి. ఇక గల్ఫ్‌లో అమెరికా కదలికలు.. హిందూ మహా సముద్రంలో భారత చర్యలను ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి గ్వడార్ పోర్టు అత్యంత అనుకూల ప్రాంతం. ఈజిప్టు, ఇరాన్, పాకిస్థాన్‌లలో పోర్టులను ఉపయోగించుకునేందుకు చైనా పలు ఒప్పందాలను కుదుర్చుకుంది.
సముద్రాలపైనా పట్టు
ఆసియా సముద్ర జలాలపై ఆధిపత్యానికి చైనా ఉరకలేస్తోంది. హిందూ మహాసముద్రంలో అనేక చోట్ల స్థావరాలను అభివృద్ధి పరుస్తున్న చైనా.. సముద్ర గర్భంలోని ఖనిజాల పైనా కన్నేసింది. అంతర్జాతీయ జలాల్లో నైరుతి దిశగా పది వేల చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఖనిజాలను తవ్వుకునేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ నుంచి చైనా అనుమతి పొందింది. ఇలాగే పసిఫిక్ సముద్రంలో 75వేల చదరపు కిలోమీటర్లు దక్కించుకుంది. ఇప్పుడు హిందూ మహాసముంద్రంపై హక్కుల కోసం ప్రయత్నిస్తోంది.
పైగా హిందూ సముద్రంలోని మూడు జల సంధుల్లోనూ (మాందేబ్, హార్మూజ్, మలక్కా) చైనాకు స్థావరాలు ఉన్నాయి. బంగాళాఖాతంలోని చిన్న చిన్న దీవుల్లో ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటోంది. మరోవైపు మలక్కా జలసంధిపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోడానికి దక్షిణ చైనా సముద్రంలోకి రవాణాపై దృష్టి సారిస్తోంది. అరేబియా సముద్రంపై పట్టు కోసం పాక్ తీరంలో పాగా వేసింది.
కొండంత రక్షణ బడ్జెట్!
చైనా మిలటరీ బడ్జెట్ క్రమంగా ఊహించని స్థాయికి చేరుకుంటోంది. ఆయు«ధ సమీకరణకు కేటాయిస్తున్న నిధుల లెక్కలు అంతుబట్టకుండా ఉన్నాయి. ఈసారి రక్షణ శాఖకు సుమారు రూ.6లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇది గత ఏడాదికంటే పది శాతం అధికం. సూపర్ పవర్‌గా నిలిచే లక్ష్యంతో చైనా ఏటా ఈ కేటాయింపులను విపరీతంగా పెంచుతూనే ఉంది.
అధికారికంగా ప్రకటించిన దానికన్నా ఇంకా ఎక్కువ నిధులనే చైనా ఖర్చు చేస్తోందని అంత ర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో భారత్ బాగా వెనుకబడి ఉంది. మన రక్షణరంగ కేటాయింపులు ఈసారి గతేడాది కంటే 5.3శాతం వృద్ధితో రూ. 1.93లక్షల కోట్లకు చేరాయి. ఇవి ఏ మూలకూ సరిపోవని రక్షణ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
source:andhra jyothy

0 comments:
Post a Comment